Indian Physicists: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ మృతి
ABN , Publish Date - May 21 , 2025 | 07:27 AM
ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ (86) మంగళవారం పుణెలో మృతి చెందారు. ఖగోళశాస్త్రంలో ఆయన చేసిన విశేష సేవలకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అందుతున్నాయి.
మోదీ, రేవంత్ సంతాపం
పుణె, హైదరాబాద్, మే 20 : ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లీకర్(86) మంగళవారం పుణెలో మృతి చెందారు. భారత శాస్త్ర రంగంలో శిఖర సమానుడైన ఆయన ఖగోళ శాస్త్ర రంగానికి ఎన్నో సేవలు అందించారు. దేశంలో పలు పరిశోధన సంస్థల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ప్రకటించారు. ఉన్నత విద్యను ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పూర్తి చేసిన నార్లికర్ 1972లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చిలో చేరి 1989 వరకు పనిచేశారు. 1998లో యూజీసీ ఆయన్ను ‘ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్’(ఐయూసీఏఏ)ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరి.. దానికి స్థాపక డైరెక్టర్‌గా నియమించింది. ఖగోళ భౌతికశాస్త్రంలో ఆయన చేసిన సేవలను గుర్తించి 1996లో యునెస్కో కళింగ అవార్డు ప్రదానం చేసింది. 1965లో కేవలం 26 ఏళ్లకే నార్లికర్ పద్మ భూషణ్ అవార్డు అందుకోవడం విశేషం. 2004లో పద్మ విభూషణ్ అందుకున్నారు. ఆయన మృతితో దేశం ఒక దూరదృష్టిగల ఖగోళ భౌతిక శాస్త్రవేత్తను కోల్పోయిందని ఇస్రో మాజీ చైర్మన్ సోమ్‌నాథ్ అన్నారు. నార్లికర్ మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు.