Japan Airlines: చావు తప్పదని విమానంలోనే వీలునామాలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:18 AM
చైనాలోని షాంఘై నుంచి జపాన్‌లోని టోక్యోకు బయల్దేరిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26వేల అడుగులు కిందకు దిగజారిపోయింది.
కుటుంబాలకు బ్యాంకు పిన్‌లు, ఇన్సూరెన్స్ వివరాలు
విమానం కూలిపోతుందన్న భయంతో ‘చివరి సందేశాలు’ పంపిన ప్రయాణికులు.. సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్
న్యూఢిల్లీ, జూలై 2: చైనాలోని షాంఘై నుంచి జపాన్‌లోని టోక్యోకు బయల్దేరిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్-737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నిమిషాల వ్యవధిలోనే 26వేల అడుగులు కిందకు దిగజారిపోయింది. 36వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం కేవలం 10నిమిషాల్లోనే 10,500అడుగులకు పడిపోయింది. జూన్ 30న సాయంత్రం 6.53గంటలకు ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 191 మంది ఉన్నారు. విమానం కుదుపునకు నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు.
విమానం కిందికి పడిపోతున్న క్రమంలో ఆక్సిజన్ మాస్కులు బయటకు వచ్చాయి. దీంతో, విమానం తప్పక కూలిపోతుందని, తాము చనిపోవడం ఖాయమని భయపడ్డ చాలా మంది ప్రయాణికులు వీలునామాలు రాశారు. ప్రియమైన వారికి సందేశాలు పంపించారు. బ్యాంకు పిన్ నంబర్లు, ఇన్సూరెన్స్ లాంటి వివరాలను కుటుంబసభ్యులకు షేర్ చేశారు. అయితే, విమానం పైలట్ చాకచక్యంగా వ్యహరించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానం పడిపోతున్న క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్ దాన్ని టోక్యోకు బదులుగా దగ్గర్లో ఒసాకాకు మళ్లించి కాన్‌సాయ్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు.