ISRO Upcoming Missions: మార్చిలోపు మరో 7 ప్రయోగాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:50 AM
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి వరకు ఇస్రో మరో ఏడు ప్రయోగాలు చేపట్టనుందని సంస్థ చైర్మన్ నారాయణన్ తెలిపారు.
2027లో గగన్‌యాన్.. 2028లో చంద్రయాన్-4
చంద్రుడిపై నుంచి నమూనాలు తీసుకొస్తాం
వరుస ప్రయోగాలతో ఇస్రో బిజీ బిజీ..
రాకెట్ల ఉత్పత్తి 3 రెట్లు పెంచేందుకు కృషి
ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడి
కోల్‌కతా, నవంబరు 16: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి వరకు ఇస్రో మరో ఏడు ప్రయోగాలు చేపట్టనుందని సంస్థ చైర్మన్ నారాయణన్ తెలిపారు. 2027లో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్‌యాన్‌కు ఏర్పాట్లు చేసుకుంటూనే.. ఈ ప్రయోగాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇస్రో ముందున్న లక్ష్యాలను ఆయన వివరించారు. 2026 మార్చిలోగా ఏడు ప్రయోగాలు చేపట్టనున్నామని, వాటిలో ఒక వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగంతోపాటు పీఎ్‌సఎల్వీ, జీఎస్‌ఎల్వీ మిషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. పూర్తిగా భారతీయ సంస్థలే తయారుచేసిన పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగం వీటిలో ఒక మైలురాయిగా నిలవనుందన్నారు. చంద్రునిపై దిగడమే కాకుండా అక్కడి నుంచి కొన్ని నమూనాలను తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టనున్న చంద్రయాన్-4 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని నారాయణన్ చెప్పారు. ఈ ప్రయోగాన్ని 2028లో చేపడతామని వెల్లడించారు. ఇక చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి మంచును అధ్యయనం చేయడం కోసం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి సంయుక్తంగా చేపట్టనున్న లూపెక్స్ మిషన్ కూడా తమ ప్రణాళికల్లో ఉందని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రాకెట్ల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతామని చెప్పారు. కాగా.. గగన్‌యాన్ మిషన్‌పై నెలకొన్న సందేహాలపై కూడా ఇస్రో చైర్మన్ స్పష్టతనిచ్చారు. ఈ మిషన్‌ను 2027 నాటికి చేపట్టే ప్రణాళికలో ఎలాంటి మార్పూ లేదన్న ఆయన.. వ్యోమగాములతో కూడిన ఈ యాత్రకు ముందు మూడు మానవరహిత టెస్టింగ్ మిషన్లు ఉంటాయని చెప్పారు. వీటిలో భాగంగా తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది పూర్తిచేస్తామన్నారు. మానవసహిత ప్రయాణం 2027లో ఉంటుందని తెలిపారు.