Chairman V Narayanan: 2027 నుంచి కులశేఖరపట్టణంలో రాకెట్ ప్రయోగాలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:51 AM
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో 2027 నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.
ఇస్రో చైర్మన్ నారాయణన్ చెన్నై, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని కులశేఖరపట్టణంలో 2027 నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఇస్రో ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడుతోంది. అయితే.. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్‌ఎస్ఎల్వీ) ప్రయోగాల నిమిత్తం రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లా కులశేఖరపట్టణంలో నిర్మిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023లో దీనికి శంకుస్థాపన చేయగా.. లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో గురువారం జరిగిన కార్యక్రమంలో నారాయణన్ మాట్లాడుతూ... 2027 ఆరంభంలో కులశేఖరపట్టణం నుంచి ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్లను ప్రయోగిస్తామని వెల్లడించారు. శ్రీహరికోట తర్వాత కులశేఖరపట్టణం భారతదేశపు రెండవ రాకెట్ లాంచ్ ప్యాడ్ అవుతుందన్నారు. గగన్‌యాన్ మిషన్ గురించి మాట్లాడుతూ... రాకెట్ రూపకల్పన, అభివృద్ధి, ఇతర ప్రాథమిక పనులు బాగా జరుగుతున్నాయని చెప్పారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, దీనికోసం ఇప్పటివరకూ 8 వేల పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. 2027లో మానవ సహిత గగన్‌యాన్ యాత్ర చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.