Sriharikota space center: మరో నాలుగేళ్లలో శ్రీహరికోటలో మూడో ప్రయోగ వేదిక
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:01 AM
వరుస ప్రయోగాలతో జోరుమీదున్న ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్‌లో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనుంది..
చెన్నై, డిసెంబరు 28: వరుస ప్రయోగాలతో జోరుమీదున్న ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్‌లో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో.. ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు శ్రీహరికోట నుంచే రాకెట్ ప్రయోగాలు చేపడుతూ వస్తోంది. ఇప్పటికే ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉండగా.. మరో నాలుగేళ్లలో మూడో లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లాంచ్ ప్యాడ్‌ల కంటే పెద్దగా దీన్ని నిర్మిచనుంది. 12,000 కిలోల నుంచి 14,000 కిలోల బరువుండే భారీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలనే ప్రణాళికల్లో ఉన్న ఇస్రోకు.. భారీ ప్రయోగ వాహనాలు (రాకెట్లు) అవసరమని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షార్ డైరెక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. ఈ రాకెట్ ప్రయోగాలకు అనువుగా మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగేళ్లలో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకువస్తామని, ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని పద్మకుమార్ వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే దాని నుంచి నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ద్వారా 14,000 కిలోలకంటే బరువైన ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్పారు.