Israel Targets Hamas: దోహాపై ఇజ్రాయెల్ బాంబులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 03:26 AM
రాజధాని దోహాలో ఉన్న హమాస్ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం ‘ఆపరేషన్ జడ్జిమెంట్ అసెంబ్లీ..
ఇద్దరు హమాస్ నేతలు..ముగ్గురు అంగరక్షకుల మృతి
మాదే బాధ్యత: నెతన్యాహు
ఖండించిన సౌదీ, ఫ్రాన్స్
బంకర్‌లోకి ఇరాన్ సుప్రీంలీడర్!
టెల్‌అవీవ్, సెప్టెంబరు 9: రాజధాని దోహాలో ఉన్న హమాస్ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ మంగళవారం ‘‘ఆపరేషన్ జడ్జిమెంట్ అసెంబ్లీ’’ పేరుతో బాంబు దాడులు చేసింది. నగరంలోని ఖతారా జిల్లా పరిఽధిలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయని, ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హమాస్ సీనియర్ నాయకులను గురిపెట్టి, ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) తెలిపింది. ఈ దాడుల్లో హమాస్ నేతలు ఖలీల్-అల్-ఖాయా, ఖాలెద్ మషాల్‌తోపాటు.. వారి అంగరక్షకులు ముగ్గురు చనిపోయారని భావిస్తున్నట్లు పేర్కొంది. ‘‘సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా.. అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ దాడి జరిపింది. ఆ దృశ్యాలను టీవీల్లో చూస్తూ.. ‘థాంక్స్ గీవింగ్ ప్రేయర్స్’ చేసిన వారిలో ఖలీల్, ఖాలెద్ ఉన్నారు’’ అని వెల్లడించింది. గాజాలోనూ మంగళవారం ఏడు టవర్లను లక్ష్యంగా చేసుకుని, జరిపిన దాడుల్లో హమాస్ నేతలు చనిపోయినట్లు తెలిపింది. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం దోహా దాడులకు తమదే బాధ్యత అని ప్రకటించారు. ఈ దాడులను ఫ్రాన్స్, సౌదీ అరేబియా ఖండించాయి. సౌదీ యువరాజు సల్మాన్ ఇజ్రాయెల్ చర్యను అంతర్జాతీయ నేరంగా పేర్కొంటూ.. ఖతార్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాల్పుల విరమణ దిశలో ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం..!