Telugu NRIs: భారతీయులకు చెడ్డపేరొస్తోంది
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:34 AM
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డపేరు వస్తోంది. కొందరు అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతోంది...
అవగాహనారాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి
వీధుల్లో ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లు, బాణసంచా ప్రమాదకరం
థియేటర్లలో పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్స్‌లు
వంటి చేష్టలతో మనపై అమెరికన్ల చిన్నచూపు
డాలస్‌లో అవగాహన సదస్సులో వక్తలు
(డాలస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
‘‘అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగువారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డపేరు వస్తోంది. కొందరు అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో ప్రవాస భారతీయుల గౌరవానికి భంగం వాటిల్లుతోంది’’ అని డాల్‌సలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి విపరీత పోకడల వల్ల భారతీయులదరూ అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. తోటకూర ప్రసాద్ ఆధ్వర్యంలో డాల్‌సలో ‘ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు’ నిర్వహించారు. ఈ సదస్సులో స్థానిక చట్టాలు, నియమనిబంధనలు, సాంస్కృతిక విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ఎలా జీవించాలన్న అంశంపై చర్చించారు. విభిన్న సంస్కృతులు, భాషలు, మతాల ప్రజలు నివసించే అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ప్రవాస భారతీయుల ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని వక్తలు వాపోయారు. అమెరికా చట్టాల ప్రకారం అనుమతులు లేకుండా వీధుల్లో ఉత్సవాలు జరుపుకోవడం, బాణసంచా కాల్చడం, లౌడ్‌స్పీకర్లు వినియోగించడం ప్రమాదకరమని చెప్పారు. రోడ్లు మూసివేసి జరిపిన ఉత్సవాల వల్ల ఒక అమెరికన్ డ్రైవర్ తుపాకీతో బెదిరించిన ఘటనను ఉదహరించారు. ఇలాంటి వేడుకలు ఆలయ ప్రాంగణాలు లేదా ఖాళీ స్థలాల్లోనే చేసుకోవాలని కోరారు. సినిమా థియేటర్ల వద్ద పాలతో అభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి విపరీత చేష్టల వల్ల అమెరికన్లు మనల్ని చిన్నచూపు చూస్తారని.. ఇలాంటి ఘటనలు ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. రాజకీయ నాయకుల అమెరికా పర్యటనల సందర్భంగా కార్ల ర్యాలీలు, నినాదాలు, హోటళ్ల వద్ద గోల చేయడం సరికాదన్నారు. అమెరికన్లతో స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చెప్పారు. డాలస్‌ను డల్లా్‌సపురమని, గంటర్‌ను గుంటూరు అని, క్యారల్టన్‌ను కేరళటౌన్ అని పేర్కొనడం వల్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. దుకాణాల్లో దొంగతనాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ స్థలాల్లో బిగ్గరగా మాట్లాడడం వంటి పనులతో చెడ్డపేరు వస్తుందని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయ విమర్శలు, అనుచిత పోస్టులు అమెరికన్ అధికారుల దృష్టికి వస్తాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.