Skill Development Scheme: ‘కౌశల్ వికాస్’లో అక్రమాల పర్వం
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:00 AM
చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిలో వారు నిలదొక్కుకునేలా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకువచ్చిన ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్’ పథకంలో...
శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్ల జారీ
న్యూఢిల్లీ, డిసెంబరు 20: చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిలో వారు నిలదొక్కుకునేలా చేయాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకువచ్చిన ‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్’ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్టు కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అధికారులు గుర్తించారు. 2015-22 మధ్య మూడు దశల్లో నిర్వహించిన శిక్షణకు సంబంధించి బిహార్, ఉత్తరప్రదేశ్(యూపీ)లలో ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. 11111111111 నంబరుతో బ్యాంకు ఖాతాలు సృష్టించడంతోపాటు ఒకే ఫొటోతో లక్షల మంది ఈ పథకం కింద నమోదు కావడం, శిక్షణ కేంద్రాలను మూసివేయడం వంటివాటిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎలాంటి ‘మెరిట్’ లేకుండానే.. సంస్థలు లక్షలాది మందికి ‘బెస్ట్ ఇన్ క్లాస్’ పేరుతో నైపుణ్య సర్టిఫికెట్లు జారీ చేసినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆడిట్ నివేదిక గత గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. కౌశల్ వికాస్ యోజన కింద 2015-22 మధ్య మూడు దశల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1.32 కోట్ల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.14,450 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మూడు దశల్లో 1.1కోట్ల మంది అభ్యర్థులు శిక్షణ సర్టిఫికెట్లు పొందారు. అయితే.. వీరి బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా.. 90,66,264 మంది అభ్యర్థుల ఖాతా నంబర్లు సున్నాగా పేర్కొనడం గమనార్హం. అదేవిధంగా 5,24,537 మంది ఖాతాలకు సంబంధించి 12,122 మందికి ఒకే నంబరు, మరో 52,381 మందికి రిపీటెడ్ నెంబర్లు ఉన్నట్టు కాగ్ గుర్తించింది. 4,72,156 మంది అభ్యర్థుల ఖాతాలకు 11111111111 నంబరు ఉన్నట్టు కాగ్ తెలిపింది. కాగా, 24.53 లక్షల మంది సర్టిఫైడ్ అభ్యర్థులకు డీబీటీ ద్వారా నిధులు మంజూరు అయ్యాయని, కానీ, వీరిలో 17.69 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే శిక్షణను పొందారని తెలిపింది.