Share News

INSV Kaundinya: పురాతన శిల్పంలా.. ఐఎన్‌ఎ్‌సవీ కౌండిన్య

ABN , Publish Date - Dec 30 , 2025 | 03:54 AM

హైలెస్సో.. హైలోస్సా.. అని పదం కలిపి తెడ్లు వేస్తూ, గాలి వాలుతో తెరచాపల ఆధారంగా నడిచే ఓడను ఇప్పుడు తయారు చేస్తే ఎలా ఉంటుంది.

INSV Kaundinya: పురాతన శిల్పంలా.. ఐఎన్‌ఎ్‌సవీ కౌండిన్య

పోర్‌బందర్‌, డిసెంబరు 29: హైలెస్సో.. హైలోస్సా.. అని పదం కలిపి తెడ్లు వేస్తూ, గాలి వాలుతో తెరచాపల ఆధారంగా నడిచే ఓడను ఇప్పుడు తయారు చేస్తే ఎలా ఉంటుంది. అది అచ్చం ఐఎన్‌ఎ్‌సవీ కౌండిన్యలా ఉంటుంది. ఎలాంటి ఇంజిన్‌ లేకుండా పురాతన కాలం నాటి సంప్రదాయ నౌకాయాన విధానంలో నడిచే కౌండిన్య నౌకను మన నౌకాదళం తయారు చేసింది. ఈ నౌక తొలి ప్రయాణం గుజరాత్‌ తీరం నుంచి మస్కట్‌కు సోమవారం ప్రారంభమైంది. పురాతన కాలంనాడు ఓడలను తయారు చేసిన స్ఫూర్తి, అల్లిక పరిజ్ఞానం, ప్రకృతి సిద్ధమైన వస్తుసామగ్రితో ఈ నౌకను రూపొందించారు. భారతీయ నౌకా చరిత్ర, కళాత్మక తయారీ, ఆధునిక నౌకా నైపుణ్యం కలయికే ఐఎన్‌ఎస్‌ కౌండిన్య. 18 మంది నావికులతో ప్రయాణం ప్రారంభించిన ఈ నౌక 1400 కి.మీ. ప్రయాణించి 15 రోజుల అనంతరం ఒమన్‌ తీరానికి చేరుతుంది.

కౌండిన్య ప్రత్యేకతలు ఇవీ..

  • అజంతా గుహల్లో సామాన్య శకం 5వ శతాబ్దంలో తీర్చిదిద్దిన ఓడ చిత్రం ఆధారంగా కేరళకు చెందిన కార్మికులు చెక్క పలకలతో కౌండిన్యను తయారు చేశారు.

  • ఎక్కడా మేకులు లాంటివి వాడకుండా తాళ్లతో చెక్కలను జత చేసినందుకు దీనిని ‘స్టిచ్‌డ్‌ షిప్‌’ అని పిలుస్తున్నారు. చెక్క పలకలను జత చేయడానికి కొబ్బరి తాళ్లు, పీచు, సహజసిద్ధ జిగురును వాడారు. నౌక పొడవు 65అడుగులు, వెడల్పు 22అడుగులు,ఎత్తు 13 అడుగులు.

  • భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేవీ, హోడీ ఇన్నోవేషన్స్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందం మేరకు 2023లో దీని తయారీ ప్రారంభించారు.

  • పూర్వ కాలంలో మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు ఓడలను నడిపిన దిగ్గజ నావికుడు కౌండిన్య పేరును ఈ నౌకకు పెట్టారు.

  • నౌక తెరచాపలపై గండభేరుండ పక్షి, సూర్యుడి రూపాలను చిత్రించారు. ముందు భాగంలో సింహ యాళి ప్రతిరూపాన్ని తీర్చిదిద్దారు. హరప్పా శైలికి ప్రతి రూపంగా ఉండే లంగరు బొమ్మను డెక్‌పై ఉంచారు.

Updated Date - Dec 30 , 2025 | 03:54 AM