IndiGo: ప్రయాణికులకు రూ.10 వేల వోచర్లు
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:59 AM
మానాల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు కాసింత అదనపు పరిహారం ఇచ్చేందుకు ఇండిగో ముందుకొచ్చింది.....
ఈ నెల 3, 4, 5 తేదీల్లో విమానాల రద్దుతోతీవ్రంగా ఇబ్బందిపడ్డ వారికి ఇస్తామన్న ఇండిగో
ఏడాదిలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 11: విమానాల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు కాసింత అదనపు పరిహారం ఇచ్చేందుకు ఇండిగో ముందుకొచ్చింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో విమానాలు రద్దయి చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని.. వారిలో కొందరు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని పేర్కొంది. అలా తీవ్రంగా ఇబ్బందిపడిన ప్రయాణికులకు రూ.10 వేల చొప్పున వోచర్లు ఇస్తామని గురువారం ప్రకటించింది. ప్రయాణ సమయానికి 24గంటల్లోపు విమానం రద్దయితే ఇచ్చే సాధారణ పరిహారానికి ఇది అదనమని తెలిపింది. ఏడాదిలోగా ఎప్పుడైనా ఇండిగో టికెట్ల బుకింగ్ కోసం ఈ వోచర్లను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్టు తెలిపింది. మొత్తం 138 ప్రాంతాలకు 1,900కుపైగా సర్వీసులను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ముందస్తు సమాచారం లేకుం డా విమాన సర్వీసులేవీ రద్దు చేయడంలేదని.. వాతావరణం, సాంకేతిక సమస్యలతో మాత్రం పలు సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. కాగా, పరిహారం వోచర్లు ఇచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన ప్రయాణికులను ఎలా గుర్తిస్తుంది, ఇందుకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న విషయాన్ని ఇండిగో వెల్లడించలేదు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇండిగో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. 3, 4, 5 తేదీల్లో అయితే వేలకొద్దీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. గురువారం కూడా 150కిపైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. అందులో ఒక్క బెంగళూరు విమానాశ్రయం నుంచే 60 సర్వీసులు ఉండటం గమనార్హం.
డీజీసీఏ ముందుకు ఇండిగో సీఈవో..
డీజీసీఏ ఆదేశాల మేరకు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఇతర ఉన్నతాధికారులు గురువారం డీజీసీఏ అధికారుల ముందు హాజరయ్యారు. గత పది రోజులుగా విమాన సర్వీసుల రద్దు, పైలట్లు, సిబ్బంది సంఖ్య, ఇతర వివరాలతో కూడిన నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా వారి నుంచి డీజీసీఏ అధికారులు పలు వివరాలు తెలుసుకుని, కీలక సూచనలు చేశారు. తిరిగి శుక్రవారం కూడా డీజీసీఏ కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు డీజీసీఏ నియమించిన ప్రత్యేక కమిటీ గురువారం గుర్‌గావ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. వి మాన సర్వీసుల నిర్వహణ, రద్దు, పైలట్లు, సిబ్బంది హాజ రు, ప్రయాణికులకు రీఫండ్లు, లగేజీ తిరిగి అందజేయడం తదితర అంశాలను సమీక్షించింది.