Civil Aviation Minister K Ram Mohan Naidu: ప్రాయోజిత సంక్షోభం?
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:44 AM
ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే అయి ఉండొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సంక్షోభం ముందువరకు ఉన్న పరిస్థితి, విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే......
ఇండిగో విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే కావొచ్చు
పరిష్కారం కోసం అన్ని కోణాలనూ పరిశీలిస్తున్నాం
అవసరమైతే ఇండిగో సీఈవోను తొలగిస్తాం
జరిమానాలు, అత్యంత కఠిన చర్యలు ఉంటాయి
వారం రోజులుగా సరిగా నిద్రకూడా పోలేదు
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు
బుధవారం 250కుపైగా ఇండిగో సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ, డిసెంబరు 10: ఇండిగో సంక్షోభం, భారీగా విమానాల రద్దు ఉద్దేశపూర్వకమే అయి ఉండొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సంక్షోభం ముందువరకు ఉన్న పరిస్థితి, విమాన సర్వీసుల నిర్వహణ తీరును చూస్తే.. అసలు ఇలా జరిగి ఉండాల్సిందే కాదని చెప్పారు. అవసరమైతే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను తొలగించేందుకు, భారీగా జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఇండిగోపై కఠిన చర్యలు చేపడతామని, భవిష్యత్తులో విమానయాన శాఖను ఎవరూ తేలికగా తీసుకోలేని స్థాయిలో ఈ చర్యలు ఉంటాయని చెప్పారు. బుధవారం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్మోహన్‌నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండిగో సంక్షోభం వెనుక ఏదో ఉద్దేశపూర్వక అంశం ఉన్నట్టు కనిపిస్తోంది. వారి నిర్వహణ తీరు, సర్వీసులపై వారికి ఉన్న పట్టును బట్టి చూస్తే.. ఈ సంక్షోభం ఏర్పడి ఉండకూడదు. అంతేకాదు ప్రత్యేకంగా ఆ సమయంలోనే సమస్య ఎందుకు మొదలైంది. అది ఎలా సంక్షోభానికి దారితీసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ అంశాలన్నింటిపైనా లోతుగా విచారణ సాగుతోందని వెల్లడించారు. ఇక ఇండిగో సీఈవోను తొలగించవచ్చనే ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘ఒకవేళ అవసరమైతే కచ్చితంగా తొలగిస్తాం. అంతేకాదు విధించేందుకు అవకాశమున్న అన్ని జరిమానాలు వేస్తాం. ఇండిగో సంక్షోభానికి సంబంధించి అన్ని కోణాలనూ పరిశీలిస్తున్నాను. గత ఏడు రోజులుగా నేను సరిగా నిద్ర కూడా పోలేదు. చాలా సేపు ఆఫీసులోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తూనే ఉన్నాను..’’ అని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. విమానయాన సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ‘విమాన విధుల సమయ పరిమితి (ఎఫ్‌డీటీఎల్)’ నిబంధనలను అమల్లోకి తెచ్చామని స్పష్టం చేశారు. విమానయాన శాఖ మంత్రిగా ఈ రంగాన్ని వేగంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడం తన బాధ్యత అని, ఈ క్రమంలో ఏర్పడే ఇండిగో సంక్షోభం వంటివి ఆ బాధ్యతను మరింత పెంచుతాయని చెప్పారు. సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు.
సీఈవో, ఉన్నతాధికారులకు డీజీసీఏ పిలుపు
విమానయాన సంక్షోభం నేపథ్యంలో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, వివిధ విభాగాల ఉన్నతాధికారులను తమ ముందు హాజరుకావాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. విమానాల రద్దు, సర్వీసుల పునరుద్ధరణ, పైలట్లు, ఇతర సిబ్బంది సంఖ్య, కొత్తగా నియామకాల కోసం చేస్తున్న ఏర్పాట్లు సహా అన్ని వివరాలతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రావాలని స్పష్టం చేసింది. ఇక ఇండిగో సంస్థ రోజువారీ వ్యవహారాలను పరిశీలించడానికి డీజీసీఏ 8 మందితో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఇద్దరు అధికారులు ఇండిగో కార్పొరేట్ కార్యాలయంలో రోజువారీ వ్యవహారాలను, విమాన సర్వీసుల నిర్వహణ, రద్దు, రీఫండ్లు, ఇతర అంశాలను పరిశీలిస్తారని తెలిపింది.
11 విమానాశ్రయాల్లో డీజీసీఏ తనిఖీలు
ఇండిగో సంక్షోభం 9వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 11 ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ నిర్ణయించింది. విమానాల రద్దు, ఆలస్యం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికుల రద్దీ, వారికి అవసరమైన సౌకర్యాలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వహణ సంస్థల సిబ్బంది సరిపడా ఉన్నారా? అనేది పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకోవాలని సూచించింది. గురువారం సాయంత్రానికల్లా నివేదికలు ఇవ్వాలని పేర్కొంది. కాగా, బుధవారం దేశవ్యాప్తంగా 250కి పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. అందులో ఢిల్లీ, బెంగళూరుల నుంచే సగం సర్వీసులు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
సంక్షోభ పరిష్కారం సరే.. ముందేం చేశారు?: హైకోర్టు
పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు సంక్షోభాన్ని పరిష్కరిచేందుకు ప్రభుత్వం మంచి చర్యలే చేపట్టిందని.. కానీ అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అప్పటివరకు ప్రభుత్వం ఏం చేస్తోందని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. మరోవైపు ఇతర విమానయాన సంస్థలు భారీగా చార్జీలు పెంచేయడాన్ని ఎలా అనుమతించారని నిలదీసింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేలా, టికెట్ చార్జీలు పూర్తిగా రీఫండ్ చేయించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్‌రావుల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అనూహ్యమైన పరిస్థితులతోపాటు మరికొన్ని అంశాలు విమానాల రద్దుకు కారణమయ్యాయని.. అయితే ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడానికి పౌర విమానయాన శాఖ, డీజీసీఏ పకడ్బందీ చర్యలు చేపట్టాయని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. కానీ దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘సంక్షోభం నెలకొన్న సమయంలో ఇతర విమానయాన సంస్థలు భారీగా ధరలు పెంచుకునేందుకు ఎలా అనుమతించారు? సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది.