Share News

IndiGo Disruptions Persist for Seventh Day: ఏడో రోజూ అంతే!

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:10 AM

ఇండిగో విమానాల సంక్షోభం వరుసగా ఏడురోజూ కొనసాగింది. సోమవారం కూడా బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ సహా పలు ఆరు మెట్రో విమానాశ్రయాల్లో ....

IndiGo Disruptions Persist for Seventh Day: ఏడో రోజూ అంతే!

  • కొనసాగిన ఇండి‘గోల’.. 562 విమానాల రద్దు

  • అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ/చెన్నై, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇండిగో విమానాల సంక్షోభం వరుసగా ఏడురోజూ కొనసాగింది. సోమవారం కూడా బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ సహా పలు ఆరు మెట్రో విమానాశ్రయాల్లో 562 విమానాల సేవలు రద్దయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఇండిగో వ్యవహారంపై అత్యవసరంగా జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిందని, చర్యలు కూడా తీసుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అయితే.. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి, చర్యలకు ఆదేశించిందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది తీవ్ర విషయమే అయినప్పటికీ.. ప్రభుత్వం చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వేచి చూద్దామని, అత్యవసర విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇండిగో విమానాల రద్దు ప్రభావం వరుసగా ఏడో రోజు కూడా భారీగా కనిపించింది. బెంగళూరు విమానాశ్రయంలో 150, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో 143, చెన్నైలో 71 విమానాలు రద్దయ్యాయి. అదేవిధంగా అహ్మదాబాద్‌, ముంబై, చెన్నై, జైపూర్‌, గువాహటి విమానాశ్రయాల్లోనూ వందలాది విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, విమాన సర్వీసులను భారీ సంఖ్యలో రద్దు చేస్తుండడాన్ని ప్రశ్నిస్తూ డీజీసీఏ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు ఇండిగో సంస్థ సోమవారం సమాధానం ఇచ్చింది. పలు కారణాల వల్ల సేవలకు అంతరాయం కలిగినట్టు పేర్కొంది. పలు సమస్యలు ఉన్నందున ఖచ్చితమైన కారణం ఏదన్నదాన్ని చెప్పలేమని పేర్కొంది.


శంషాబాద్‌లో 112 విమానాలు రద్దు

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మొత్తం 112 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 54 విమానాలు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు చేరుకోవాల్సిన 58 విమాన సర్వీసులు ఉన్నాయి. ఆరు రోజులుగా ఈ విమానాశ్రయంలో దాదాపు 650 విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా, ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఆ కంపెనీని నిర్వహిస్తున్న ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ షేర్ల విలువ సోమవారం 8ు కన్నా అధికంగా తగ్గింది.

10వ తేదీకల్లా పరిష్కారం: ఇండిగో

ప్రస్తుత సంక్షోభంపై వివరణ ఇచ్చేందుకు ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బెర్స్‌కు నిర్దేశించిన గడువును డీజీసీఏ పొడిగించింది. మరో 24 గంటలపాటు(సోమవారం సాయంత్రం 6 వరకు)సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇండిగో వ్యవహారంపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బుధవారం కమిటీ ముందు హాజరు కావాలని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బెర్స్‌కు సమన్లు జారీ చేసింది. ఇదిలావుంటే, ఈ నెల 10వ తేదీ నాటికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఇండిగో తెలిపింది. విమానాల సేవలు సాధారణ స్థితికి వస్తాయని వివరించింది. కాగా, సోమవారం టికెట్లకు సంబంధించి రూ.827 కోట్లను ప్రయాణికులకు తిరిగి చెల్లించారు. మరోవైపు.. ప్రస్తుత కీలక సమయంలో సహకరించాలని పైలట్లకు డీజీసీఏ విన్నవించింది.

Updated Date - Dec 09 , 2025 | 03:10 AM