Share News

PM Modi: భారత్‌కు తొలి మహిళా ప్రపంచ కప్‌ లక్షలాది మంది యువతకు స్ఫూర్తి

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:33 AM

క్రీడల నుంచి స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) విద్య వరకు మహిళలు సత్తా చాటుతున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు...

PM Modi: భారత్‌కు తొలి మహిళా ప్రపంచ కప్‌ లక్షలాది మంది యువతకు స్ఫూర్తి

  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, నవంబరు 3: క్రీడల నుంచి స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) విద్య వరకు మహిళలు సత్తా చాటుతున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ప్రపంచ కప్‌ పోటీల్లో భారత మహిళా జట్టు అద్భుత విజయం దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ విజయం దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో తొలిసారి నిర్వహించిన సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌(ఈఎ్‌సటీఐసీ) సదస్సు-2025లో ప్రధాని ప్రసంగించారు. ‘‘ఈ సదస్సు పూర్తిగా సైన్స్‌కు సంబంధించిందే. అయినా, ముందుగా.. టీమిండియా మహిళలు సాధించిన అద్భుత విజయాన్ని ప్రస్తావించాలి. ఇది భారతకు దక్కిన తొలి మహిళా ప్రపంచ కప్‌. మహిళా జట్టులోని ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా.’’ అని అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనూ మహిళలు విశేషంగా రాణిస్తున్నారని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా నూతన ఆవిష్కరణల విషయంలో దూసుకుపోతున్నారని, ఈ క్రమంలో ‘పేటెంట్‌’ల కోసం దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ‘‘పదేళ్ల కిందటి వరకు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య ఏడాదికి 100లోపే ఉండేది. కానీ, ఇప్పుడు ఏటా 5 వేల మందికి పైగా తమ ఆవిష్కరణల పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారు.’’ అని మోదీ తెలిపారు. కాగా, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో రూ.లక్ష కోట్లతో రిసెర్చ్‌, డెవల్‌పమెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌(ఆర్డీఐ) పథకానికి మోదీ శ్రీకారం చుట్టారు.

Updated Date - Nov 04 , 2025 | 04:33 AM