India Stealth Fighter Dilemma: కొనబోతే కొరివి
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:51 AM
గగనతల యుద్ధాల్లో అత్యంత ప్రభావం చూపే ఐదో తరం యుద్ధవిమానాల తయారీలో అమెరికా, చైనా.. ఇప్పటికే మిగతా దేశాలకు అందనంత దూరంలో....
వాయుసేన ముందు సవాల్.. స్టెల్త్ విమానాలపై ఎటూ తేల్చుకోలేని స్థితి
చైనా వద్ద 300 జె-20 స్టెల్త్ విమానాలు.. జె-35ల తయారీలో బిజీ
2030 నాటికి పాక్‌కు జే-35లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న డ్రాగన్
ఐదేళ్లలో ఇరు దేశాల నుంచీ పెను ముప్పు.. మన వద్ద ఉన్నవి రాఫెల్‌లే!
ఏఎంసీఏ విమానాలు తయారుచేసుకోవాలన్నా మరో పదేళ్లు
మనకున్న ప్రత్యామ్నాయాలు ఎఫ్ 35 లేదా ఎస్‌యూ 57లు కొనడమే
ఎఫ్-35ల స్టెల్త్ సామర్థ్యం అద్భుతమే కానీ.. కొనాలంటేనే షరతులు
వాటితో పోలిస్తే ఎస్‌యూ-57ల స్టెల్త్ సామర్థ్యం అంతంత మాత్రమే
కొనాలన్నా అవి అందుబాటులోకి వచ్చేసరికి పదేళ్ల దాకా పట్టొచ్చు
ఎల్లుండి ‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం
(సెంట్రల్ డెస్క్)
గగనతల యుద్ధాల్లో అత్యంత ప్రభావం చూపే ఐదో తరం యుద్ధవిమానాల తయారీలో అమెరికా, చైనా.. ఇప్పటికే మిగతా దేశాలకు అందనంత దూరంలో ఉన్నాయి! అమెరికా వద్ద అద్భుతమైన స్టెల్త్ (శత్రుదేశ రాడార్లకు చిక్కని) సామర్థ్యాలున్న ఎఫ్-35లు, ఎఫ్-22లు ఉండగా.. చైనా వద్ద ఇప్పటికే 300కు పైగా జే-20 స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి! ఇవి కాక జే-35లను చైనా తయారుచేస్తోంది. రేసులో మరింత ముందుకెళ్లి.. వైట్ ఎలిఫెంట్ (జే36) పేరిట ఆరో తరం యుద్ధ విమానాలనూ అభివృద్ధి చేస్తోంది. తాను తయారు చేసే జే-35లను 2030 నాటికి పాకిస్థాన్‌కు కూడా సరఫరా చేసేందుకు చైనా సిద్ధమైంది. అంటే.. మన దాయాదికి కూడా మరో ఐదేళ్లలో ఐదో తరం యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తాయన్నమాట. మరి ఈ రేసులో భారత్ ఎక్కడుంది? అంటే.. దశాబ్ద కాలం వెనకబడి ఉంది. మన వద్ద ప్రస్తుతం ఉన్నవి నాలుగో తరం యుద్ధవిమానాలే. రాఫెల్ యుద్ధవిమానాలు ఈ కోవలోకే వస్తాయి. ఐదోతరం ఫైటర్ జెట్ మనవద్ద ఒక్కటి కూడా లేదు సరికదా.. వాటిని సమకూర్చుకోవడానికి ఇంకా పదేళ్లు పడుతుందని రక్షణ రంగ నిపుణుల అంచనా! ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఐదో తరం యుద్ధ విమానాల విషయంలో భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలు మూడు. వాటిలో మొదటిది.. రూ.15 వేల కోట్లతో చేపట్టిన ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ-ఆమ్కా)’. ఇవి 2035 నాటికి వాయుసేనకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. కానీ.. దానిపైనా పలు సందేహాలున్నాయి. ఎందుకంటే.. అసలు ఈ విమానాల తయారీకి ఏ ఇంజన్ వాడాలన్నదే ఇంకా తేలలేదు. ఫ్రెంచ్ కంపెనీ శాఫ్రాన్‌తో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయి. అవి ఫలించి ఇంజన్ తయారీ మొదలుపెట్టినా, అవి అందుబాటులోకి వచ్చేసరికి 2033-2034 అవుతుంది. మరి అప్పటిదాకా చైనా, పాక్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నకు సమాధానంగా మిగతా రెండు ప్రత్యామ్నాయాలూ తెరపైకి వస్తున్నాయి. అవి.. అమెరికన్ ఎఫ్-35లు, రష్యన్ సుఖోయ్-57లు.
రెండింటితో కొన్ని సమస్యలు
ఐదో తరం యుద్ధవిమానాలైన ఎఫ్-35లను భారత్‌కు విక్రయించడానికి ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ.. దాంతో చాలా సమస్యలు ఉంటాయి. ఎఫ్-35ల స్టెల్త్ సామర్థ్యం అద్భుతం. అయితే, వాటిని కొనాలంటే అమెరికా పలు షరతులు విధిస్తుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థకు దూరంగా ఈ విమానాలను ఉంచాలని పట్టుపడుతుంది. ఎఫ్-35లను డిటెక్ట్ చేసేవిధంగా ఎస్400ను ట్యూన్ చేసుకుంటామన్న భయమే ఇందుకు కారణం. రెండో సమస్య.. అమెరికా మనకు ఈ విమానాలను విక్రయించినప్పటికీ, సోర్స్ కోడ్ ఇవ్వదు. అలా ఇవ్వకపోతే మన బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం వంటి క్షిపణులను ఆ యుద్ధవిమానాలతో ఇంటిగ్రేట్ చేయలేం. ఇదో పెద్ద సమస్య. అన్నిటికన్నా అతిపెద్ద సమస్య.. ఎఫ్-35 యుద్ధవిమానాల్లో కిల్ స్విచ్ ఉంటుంది. అంటే.. మనం చేసే యుద్ధం ఏదైనా అమెరికాకు నచ్చకపోతే.. మన దగ్గర ఉన్న ఎఫ్-35లేవీ పనిచేయకుండా అమెరికా రిమోట్‌గా ఆపేయగలదు. అందుకే.. భారత్ ఆ విమానాల కొనుగోలుకు మొగ్గు చూపట్లేదు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం.. రష్యా వద్ద ఉన్న ఎస్‌యు-57ల కొనుగోలు. కానీ, వీటికి చాలా సమస్యలున్నాయి. నిజానికి ఈ విమానాల తయారీలో తొలుత రష్యాతో భారత్ కూడా పాలుపంచుకుంది. కానీ.. రష్యన్లు ఈ విమానం తయారీలో అనుసరిస్తున్న విధానాలు మనకు నచ్చలేదు. విమానం మొత్తానికీ స్టెల్త్ సామర్థ్యం (ఏ వైపు నుంచీ కూడా శత్రు రేడార్లకు చిక్కకుండా ఉండే సామర్థ్యం) ఉండాలని భారత్ భావిస్తే.. ముందు భాగంలో మాత్రమే ఆ సామర్థ్యం ఉంటే సరిపోతుందని రష్యా భావించింది. దీనికితోడు.. ఎస్‌యు-57 సోర్స్ కోడ్ ఇవ్వడానికి కూడా రష్యా అప్పట్లో అంగీకరించలేదు. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి భారత్ బయటకు వచ్చేసింది. దరిమిలా రష్యా ఎస్‌యు-57ల స్టెల్త్ సామర్థ్యం.. ఎఫ్-35, ఎఫ్-22, జె-20, జె-35లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఎస్‌యు-57 రేడార్ క్రాస్ సెక్షన్ (ఆర్‌సీఎస్) వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక యుద్ధ విమానం ఆర్‌సీఎస్ ఎంత తక్కువగా ఉంటే దానికి అంత ఎక్కువ స్టెల్త్ సామర్థ్యం ఉన్నట్టు. ఎఫ్-35ల ఆర్‌సీఎస్ 0.001 నుంచి 0.005 చదరపు మీటర్లు. అంటే.. శత్రు రేడార్లకు ఆ విమానం అంత చిన్నగా.. ఒక పురుగులాగా కనపడుతుందన్నమాట. జే-20ల ఆర్‌సీఎస్ 0.02 నుంచి 0.1 చదరపు మీటర్లు అని అంచనా. అదే ఎస్‌యు-57 ఆర్‌సీఎస్.. 0.1 నుంచి 0.5 చదరపు మీటర్లు. ఎఫ్-35, జే20, జే35.. దేంతో పోల్చినా రేడార్ స్ర్కీన్ మీద ఇది చాలా పెద్దగా కనపడుతుంది.
అంతేకాదు.. ప్రస్తుతం రష్యా తయారుచేస్తున్న ఎస్‌యు57 విమానాలకు సూపర్ క్రూయిజ్ (ఆఫ్టర్ బర్నర్లు లేకుండా సూపర్ సానిక్ వేగంతో ఎక్కువసేపు ప్రయాణించే) సామర్థ్యం లేదు. సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఉండే కొత్త ఇంజన్ అభివృద్ధికి రష్యా శ్రమిస్తోంది. ఇన్ని సమస్యలున్నప్పటికీ.. భారత్‌కు వీటిని కొనుగోలు చేయడం తప్ప ప్రస్తుతం వేరే గతి లేని పరిస్థితి. ఈ సంగతి తెలుసు కాబట్టే రష్యా మనతో వీటిని కొనిపించేందుకు ప్రయత్నిస్తోంది. 114 రఫెల్ యుద్ధవిమానాలు.. 60 ఎస్‌యు-57లు కొనుగోలు చేయాలన్న భారత్ ఆలోచనలకు భిన్నంగా.. మొత్తం 200 ఎస్‌యు-57 విమానాలను కొనుగోలు చేయాలని సూచిస్తోంది. అలా కొంటే.. ఈ విమానాల సోర్స్ కోడ్ ఇస్తామని.. వాటితో మన క్షిపణులను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని.. భారత్‌లోనే వాటిని తయారు చేసుకోవచ్చని.. కావాలంటే ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేసుకోవచ్చని అంటోంది. ఈ ఏడాది డిసెంబరులో రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడు వీటి కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఒకవేళ ఒప్పందం కుదిరినా అవి మనకు అందుబాటులోకి రావడానికి పదేళ్లు పడుతుందని అంచనా! అయినా గత్యంతరం లేని పరిస్థితి. ఎఫ్-35లు, జే-20, జే-35లంత సమర్థమైనవి కాకపోయినా.. తప్పక వీటిని కొనాల్సిన పరిస్థితిలో భారత్ ఉందని చెప్పొచ్చు!!
చివరాఖరు: ఒకవేళ పుతిన్ మనదేశానికి వచ్చినప్పుడు వీటి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి! - సెంట్రల్ డెస్క్
అప్పటిలోగా ఏంచేయాలి?
ఇప్పటికే చైనా వద్ద 300కు పైగా జే-20లు ఉన్నాయి. 2035 నాటికి 1500 జే-20ల తయారీని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిలో కొన్నింటిని పాకిస్థాన్‌కి ఇస్తే.. రెండు దేశాలూ భారత్‌కు పక్కలో బల్లేల్లాగా మారుతాయి. మనకు ఐదో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి రావడానికి పదేళ్లు పడుతుంది కాబట్టి.. అప్పటిదాకా ఆ లోటును పూడ్చుకోవడం కత్తిమీద సాములా ఉంటుంది. మనవద్ద ఉన్న, కొత్తగా కొనబోతున్న రఫెల్ యుద్ధవిమానాలకు ఫ్రంటల్ స్టెల్త్ ఉంటుంది కాబట్టి వాటిని సమర్థంగా వాడుకోవాలి. అలాగే.. మన మీదకి దూసుకువచ్చే స్టెల్త్ విమానాలను గుర్తించేలా మన రేడార్ వ్యవస్థలను, గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి.
ఐదోతరం యుద్ధ విమానం అంటే?
రిచర్డ్ పి.హాలియన్ అనే ఎయిర్ హిస్టారియన్ 1990లో.. యుద్ధవిమానాలను ఆరు తరాలుగా వర్గీకరించారు. వేగం, టెక్నాలజీ వంటివాటి ఆధారంగా ఆయన ఆ వర్గీకరణ చేశారు. అప్పటికి స్టెల్త్ సామర్థ్యం ఇంకా ఏ దేశానికీ అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆయన వర్గీరణలో ఆ అంశం కనిపించదు. 2000 సంవత్సరం తర్వాత అమెరికా వాయుసేన, వైమానిక రంగ నిపుణులు రిచర్డ్ వర్గీకరణను నాలుగు జనరేషన్లకు కుదించి.. స్టెల్త్ సహా ఐదు సామర్థ్యాలు ఉన్న విమానాలను ఐదోతరంగా పేర్కొన్నారు. స్టెల్త్ సామర్థ్యం అంటే శత్రు రేడార్లకు దొరక్కుండా ఉండడం. మిగతా నాలుగూ.. సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అడ్వాన్స్‌డ్ సెన్సర్ ఫ్యూజన్, హైలీ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్, నెట్‌వర్క్ సెంట్రిక్ వార్‌ఫేర్ కేపబిలిటీ(ఫైటర్‌జెట్లు, డ్రోన్లు, రేడార్లు, ఉపగ్రహాలు, గ్రౌండ్ స్టేషన్లు ఒక డిజిటల్ నెట్‌వర్క్‌లాగా ఏర్పడతాయి. దీనివల్ల పైలట్‌కు.. తనకు కనిపించని కోణాల్లో ఉన్న శత్రువుల గురించి కూడా సమాచారం వస్తుంది. శత్రు లక్ష్యాలను ఛేదించడం సులువవుతుంది).. ఈ ఐదూ ఉండే వాటిని ఐదో తరం యుద్ధ విమానాలుగా పేర్కొంటారు.