‘రుద్రాస్త్ర’ పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:59 AM
ఎక్కువసేపు గగనతలంలో ఎగురుతూ లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడిచేసే సత్తా ఉన్న ‘రుద్రాస్త్ర’ త్వరలోనే భారత సైన్యానికి అందుబాటులోకిరానుంది.
న్యూఢిల్లీ, జూన్ 12: ఎక్కువసేపు గగనతలంలో ఎగురుతూ లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడిచేసే సత్తా ఉన్న ‘రుద్రాస్త్ర’ త్వరలోనే భారత సైన్యానికి అందుబాటులోకిరానుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) రూపొందించిన మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) రుద్రాస్త్రను పోక్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రీడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది. పరీక్ష సందర్భంగా ఇది 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేసింది.
రియల్‌టైమ్‌లో వీడియో అందించడంతోపాటు లాంచింగ్ పాయింట్‌కు సురక్షితంగా తిరిగొచ్చింది. లక్ష్యం ఉన్న ప్రాంతంలో సంచరించడాన్ని కూడా కలుపుకొంటే దీని రేంజ్ 170 కిలోమీటర్లు. ఇది గాలిలో 1.5గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించింది. ఈ పరీక్ష సందర్భంగా ప్రెసిషన్ గైడెడ్ యాంటీ పర్సనల్ వార్‌హెడ్‌ను మోహరించగా.. భూమికి అత్యంత తక్కువ ఎత్తులోకివచ్చాక రుద్రాస్త్ర దాన్ని పేల్చివేసింది.