Share News

First Hydrogen Train: హైడ్రోజన్‌ రైలు వచ్చేస్తోంది!

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:06 AM

భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది....

First Hydrogen Train: హైడ్రోజన్‌ రైలు వచ్చేస్తోంది!

  • గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లో చేరనున్న భారతీయ రైల్వే

న్యూఢిల్లీ, డిసెంబరు 14: భారతీయ రైల్వే తన సుదీర్ఘ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రైలు పైలట్‌ ప్రాజెక్టుగా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే కూడా గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లో చేరనుంది. రిసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎ్‌సవో) నిర్దేశిత ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. గతవారం లోక్‌సభ వేదికగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు నిర్మాణం పూర్తయిందని, దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ రైలు నిర్వహణ కోసం హరియాణాలోని జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ప్లాన్‌ చేశామన్నారు. ఇది పూర్తిగా భారత్‌లోనే రూపొందించి అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ రైలు. పది కోచ్‌లతో కూడిన ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్‌ రైలుగా గుర్తింపు పొందింది. బ్రాడ్‌గేజ్‌ ట్రాక్‌పై నడిచే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్‌ రైలు కూడా ఇదే. ఈ రైలులో 1200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్‌ పవర్‌ కార్లు (డీపీసీ), 8ప్యాసింజర్‌ కోచ్‌లు ఉంటాయి. ఇది హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉపయోగించి రసాయన చర్య ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి నడుస్తుంది. పర్యావరణానికి హానిచేసే కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేయదు. అంటే సున్నా కర్బన ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణ హితమైనది. పర్యావరణ అనుకూల ప్రయాణంలో ఇదొక గేమ్‌ చేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో హైడ్రోజన్‌ రైళ్ల విస్తరణకు మార్గం సుగమంఅవుతుంది. ముఖ్యం గా విద్యుత్‌ ట్రాక్‌లులేని మార్గాల్లో ఈ రైళ్లను నడిపే వీలుకలుగుతుంది.

Updated Date - Dec 15 , 2025 | 04:06 AM