Harsh Treatment at Georgia Border: పర్యాటకులను పశువుల్లా చూశారు..!
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:07 AM
జార్జియా పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులతో అక్కడి అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించారు....
జార్జియా అధికారుల తీరుపై భారతీయ మహిళ ధ్వజం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: జార్జియా పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులతో అక్కడి అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించారు. తమను గంటల తరబడి జంతువుల్లా రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మేనియా నుంచి 56 మంది పర్యాటకులతో కూడిన బృందం సడఖ్లో సరిహద్దు వద్ద జార్జియాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో తమకు ఎదురైన అనుభవాలను బాధితురాలు ధ్రువీ పటేల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమవద్ద ఈ-వీసాలు, చెల్లుబాటయ్యే అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ అవమానాలతో పాటు నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపోగా, టాయ్‌లెట్‌కు కూడా వెళ్లనీయలేదని మండిపడ్డారు. రెండు గంటలకు పైగా తమ పాస్‌పోస్టులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నేరస్థుల్లాగా తమను వీడియోలు తీశారని తెలిపారు.