Share News

Higher Education: ఆ ఐదు దేశాలవైపే భారతీయ విద్యార్థుల చూపు

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:43 AM

ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ప్రధానంగా అయిదు దేశాలపై దృష్టి సారించారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలంటే ఇష్టపడుతున్నారు...

Higher Education: ఆ ఐదు దేశాలవైపే భారతీయ విద్యార్థుల చూపు

  • 13 లక్షల మంది విదేశీ చదువులకు

  • అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌ నుంచే

  • నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 22: ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ప్రధానంగా అయిదు దేశాలపై దృష్టి సారించారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలంటే ఇష్టపడుతున్నారు. ఇవి టాప్‌-5లో ఉన్నాయి. ఉన్నత విద్య అంతర్జాతీయకరణ పేరుతో సోమవారం నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడయింది. 2024లో కెనడాకు 4.27లక్షల మంది, అమెరికాకు 3.37 లక్షల మంది, బ్రిటన్‌కు 1.85 లక్షల మంది, ఆస్ట్రేలియాకు 1.22 లక్షల మంది, జర్మనీకి 42,997 వేల మంది విద్యార్థులు వెళ్లారు. మొత్తంగా 13.35 లక్షల మంది ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు. దేశం మొత్తం మీద ఉన్నత విద్య చదివే వారి సంఖ్య 15.5 కోట్లుగా ఉండడం గమనార్హం. భారతీయులు విదేశాలకు వెళ్లడమే కాదు...విదేశాల నుంచి ఇక్కడికి కూడా చదువుల నిమిత్తం వస్తున్నారు. విదేశాల నుంచి ఒక విద్యార్థి వస్తుంటే ఇక్కడ నుంచి 28 మంది విదేశాలకు వెళ్తున్నారు. నేపాల్‌, ఆఫ్ఘానిస్థాన్‌, అమెరికా, బంగ్లాదేశ్‌, యూఏఈ నుంచి ఇక్కడికి చదువుల నిమిత్తం వస్తున్నారు. ఆయా దేశాల్లోని విదేశీ విద్యార్థుల శాతాలను పరిశీలిస్తే లాత్వియాలో అత్యధికంగా 17.4ు మంది, ఐర్లాండ్‌లో 15.3ు మంది, జర్మనీలో 10.1ు మంది భారతీయులు ఉన్నారు. రాష్ట్రాల వారీ వివరాలను విశ్లేషిస్తే 2020 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ ఏడాది ఏపీ నుంచి 35,614 మంది వెళ్లారు. తరువాతి స్థానంలో పంజాబ్‌ (33,412 మంది) ఉంది. చదువుల కోసం భారతీయ విద్యార్థులు వెచ్చిస్తున్న సొమ్ము కూడా గణనీయంగానే ఉంది.

Updated Date - Dec 23 , 2025 | 03:43 AM