US Border Control Abuse: సంకెళ్లు వేసి.. నేలకు అదిమి..
ABN , Publish Date - Jun 10 , 2025 | 05:32 AM
అక్రమ వలసదారులను వెనక్కి పంపటంలో భాగంగా.. ఓ భారతీయ విద్యార్థిని అమెరికా అధికారులు చేతులు వెనక్కి కట్టి, సంకెళ్లు వేసి, నేలకు అదిమి పెట్టిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారుల అమానుషం
అక్రమంగా వచ్చాడని వెనక్కి పంపిన వైనం.. న్యూజెర్సీలో ఘటన
వాషింగ్టన్, జూన్ 9: అక్రమ వలసదారులను వెనక్కి పంపటంలో భాగంగా.. ఓ భారతీయ విద్యార్థిని అమెరికా అధికారులు చేతులు వెనక్కి కట్టి, సంకెళ్లు వేసి, నేలకు అదిమి పెట్టిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో నేవార్క్ విమానాశ్రయంలో జరిగిన ఈ దారుణంపై భారతీయ అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హెల్త్‌బాట్స్ ఏఐ’ అనే సంస్థ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎన్నారై కునాల్ జైన్.. ఈ ఘటన తాలూకు వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘విమానాశ్రయంలో ఓ భారతీయ యువ విద్యార్థికి నేరస్థునిలా బేడీలు తగిలించి తిప్పి పంపటం చూశాను. కలలు సాకారం చేసుకోవటానికి ఆ యువకుడు ఈ దేశానికి వచ్చాడు. అంతేగానీ, ఎవరికీ హాని చేయటానికి కాదు. ఆ అబ్బాయి ఏడుస్తుంటే కూడా నేను ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను. నా గుండె పగిలిపోయినట్లు అనిపించింది. నిజంగా ఇది మానవ విషాదం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు యువకుడు హరియాణా భాష హరియాణ్వీ మాట్లాడుతున్నట్లు అనిపించిందని తెలిపారు. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ జరుగుతున్నాయన్నారు. ‘వీసా లభించిన మార్నాడే ఉదయం అమెరికాలో అడుగుపెడుతున్న ఈ పిల్లలు.. తమ రాకకు కారణాలేమిటో సహేతుకంగా అధికారులకు చెప్పలేకపోతున్నారు. దాంతో వారిని నేరస్థుల్లా చూస్తూ, అదే రోజు సాయంత్రం విమానంలో తిప్పిపంపుతున్నారు’ అని తెలిపారు. జైన్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘నేనేమీ పిచ్చివాడిని కాదు.. నన్ను అధికారులు పిచ్చివాడిలా మార్చాలని చూస్తున్నారు’ అంటూ ఆ యువకుడు అరవటం ఓ వీడియోలో ఉంది. కాగా, పలువురు భారతీయ అమెరికన్లు ఈ ఘటనపై ఆగ్రహం, వ్యక్తం చేస్తున్నారు.
లాస్ ఏంజెలెస్‌కు విముక్తి కల్పిస్తాం!
అక్రమ వలసదారుల నుంచి లాస్ ఏంజెలె్‌సకు విముక్తి కలిగిస్తామని, వలసదారుల ఉద్యమాలను అణిచివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ క్రిస్టీ నియోమ్‌ను ఆయన ఆదేశించారు. వలసదారుల బారి నుంచి నగరానికి స్వేచ్ఛకల్పించాలని పేర్కొన్నారు. ‘‘అమెరికాలో ఒకప్పుడు గొప్ప నగరంగా ఉన్న లాస్ ఏంజెలెస్.. అక్రమ వలసదారుల దండయాత్ర, నేరస్థుల ఆక్రమణలతో నిండిపోయింది. ఇప్పుడు హింసాత్మక తిరుగుబాటు దారులు ఫెడరల్ ఏజెంట్లపై(పోలీసులు) దాడులు చేస్తున్నారు. అంతేకాదు.. మనం చేపట్టిన బహిష్కరణ కార్యకలాపాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
12 దేశాల పౌరులపై అమెరికా నిషేధం
విదేశాంగ విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అమెరికాలో ప్రయాణించకుండా 12 దేశాల పౌరులపై నిషేధం విధించింది. మరో ఏడు దేశాల పౌరుల ప్రవేశాలపై కఠిన ఆంక్షల వేటు వేసింది. ఈ ఆదేశాలు మంగళవారం (భారత్ కాలమానం) నుంచి అమలులోకి వస్తాయి. దీని ప్రభావం ఆఫ్రికా, పశ్చిమాసియాలోని దేశాలపైనే అధికంగా పడనుంది. నిషేధం వేటు పడిన దేశాల్లో అఫ్ఘానిస్థాన్, ఇరాన్, మయన్మార్, చాద్, కాంగో, గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయి. ఇక.. ప్రయాణ ఆంక్షలకు గురైన దేశాల్లో బురుండీ, క్యూబా, లావోస్, సియర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనెజులా ఉన్నాయి. అమెరికా బయట ఉంటూ, ధ్రువీకరించిన వీసాలు లేనిపక్షంతో ఈ ఏడు దేశాల పౌరులను అమెరికాలో ప్రయాణించడానికి అనుమతించరు.