Haifas Mayor Honored Indian Soldier: హైఫాకు విముక్తి కల్పించింది భారత జవాన్లే
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:03 AM
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హైఫా నగర విముక్తి కోసం తమ ప్రాణాలర్పించిన భారతీయ సైనికులకు.. ఆ నగర మేయర్ డాక్టర్ ఐనత్...
బ్రిటిషర్లు కాదు.. చరిత్ర పుస్తకాల్లోనూ ఆ మార్పు చేస్తున్నాం.. ఇజ్రాయెల్‌లోని హైఫా నగర మేయర్ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హైఫా నగర విముక్తి కోసం తమ ప్రాణాలర్పించిన భారతీయ సైనికులకు.. ఆ నగర మేయర్ డాక్టర్ ఐనత్ కాలి్‌ష-రోటెమ్ నివాళులర్పించారు. భారతదేశానికి-హైఫా నగరానికి మధ్య ఉన్న సుసంపన్నమైన చరిత్రను ప్రేరణాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. హైఫా నగర భవిష్యత్తుకు సంబంధించి తమ వద్ద భారీ ప్రణాళికలు ఉన్నాయని.. వాటిలో భారత్‌ను ముఖ్యమైన భాగస్వామిగా చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం నుంచి హైఫా నగరానికి విముక్తి కల్పించింది భారతీయ సేనలైతే.. చరిత్ర పుస్తకాల్లో మాత్రం ఆ ఘనత బ్రిటిష్ సేనలకు ఆపాదించారని.. దాన్ని ఇప్పుడు మారుస్తున్నామని ఆయన తెలిపారు. ‘నేను హైఫా నగరంలోనే పుట్టి పెరిగాను. ఈ నగరానికి స్వేచ్ఛనిచ్చింది బ్రిటిషర్లంటూ మాకు చెబుతూ వచ్చారు. కానీ, ఒట్టోమాన్స్ నుంచి ఈ నగరానికి విముక్తి కల్పించింది భారతీయులు.. బ్రిటిషర్లు కాదని తెలుసుకున్నట్టు హిస్టారికల్ సొసైటీకి చెందిన వారు నాకు చెప్పేదాకా తెలియదు’’ అని ఆయన వివరించారు. ఆ కథేంటంటే.. అప్పటికి దాదాపు 400 సంవత్సరాలుగా హైఫా నగరం ఒట్టోమాన్‌ల పాలనలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1918లో సెప్టెంబరు 23న.. బ్రిటిష్ సైన్యంలోని మైసూర్ లాన్సర్స్, హైదరాబాద్ లాన్సర్స్, జోధ్‌పూర్ లాన్సర్స్ రెజిమెంట్లకు చెందిన 400 మంది అశ్విక దళ సైనికులు హైఫా నగర విముక్తికి నడుం బిగించారు. కత్తులు, బల్లాలు ధరించి, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కార్మెల్ పర్వతాన్ని అధిరోహించి అక్కడున్న 1500 మందికిపైగా ఒట్టోమాన్ టర్కులు, జర్మనీ, ఆస్ట్రియా సేనలపై విరుచుకుపడ్డారు. మెషీన్ గన్ల తూటాలు దూసుకొస్తున్నా వెనక్కి తగ్గక శత్రుసైనికులను తరిమికొట్టారు. ఆ యుద్ధంలో అసమాన ప్రతిభాసాహసాలు చూపిన కెప్టెన్ అమన్‌సింగ్ బహదూర్, దఫాదార్ జోర్ సింగ్‌కు అప్పట్లో ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను ప్రదానం చేశారు. అలాగే.. కెప్టెన్ అనోప్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ సగత్ సింగ్‌లను మిలటరీ క్రాస్‌తో సన్మానించారు. ‘హైఫా వీరుడు’గా పేరొందిన మేజర్ దల్పత్ సింగ్‌ను (జోధ్‌పూర్ లాన్సర్స్ కమాండర్) కూడా మిలటరీ క్రాస్ వరించింది. ఆ యుద్ధంలో ఆయన వీరోచితంగా పోరాడి వెన్నులో తూటాలతో నేలకొరిగాడు. చరిత్రకారులు ఈ యుద్ధాన్ని ‘చరిత్రలోనే చివరి, అత్యంత గొప్ప అశ్విక దళ యుద్ధం’గా అభివర్ణిస్తుంటారు. ఇండియన్ ఆర్మీ ఏటా సెప్టెంబరు 23వ తేదీని ‘హైఫా దినం’గా పాటిస్తుంది. వీరిలో జోధ్‌పూర్ లాన్సర్స్ రెజిమెంట్ 8 మంది సైనికులను కోల్పోయినప్పటికీ.. 700 మందిని ఖైదీలుగా పట్టుకుంది.