Railway Luggage Limit: ఇక రైళ్లల్లోనూ లగేజీపై నియంత్రణ
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:16 AM
విమానాల్లో వెళ్లేటప్పుడు లగేజీ నిర్ణీత బరువుకు మించితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది...
రూల్స్‌ను కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే
న్యూఢిల్లీ, ఆగస్టు 19: విమానాల్లో వెళ్లేటప్పుడు లగేజీ నిర్ణీత బరువుకు మించితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చాలామందికి తెలియని విషయమేంటంటే.. రైళ్లలో మనం తీసుకెళ్లగలిగే సామాను బరువు మీద కూడా అలాంటి నియంత్రణలే ఉన్నాయి. ఇకపై ఆ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. దాని ప్రకారం.. ప్రస్తుతానికి కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తమ లగేజీ బరువును ఎలకా్ట్రనిక్ తూకాలపై తూయించుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించి బరువు ఉంటే.. దానిపై అదనపు రుసుము లేదా జరిమానా విధిస్తారు. ఏసీ మొదటితరగతి ప్రయాణికులైతే.. ఒక్కొక్కరూ 70 కిలోల దాకా బరువున్న లగేజీని తీసుకెళ్లొచ్చు. దీనిపై మార్జినల్ అలవెన్స్.. 15 కిలోలు. అంటే 85 కిలోల దాకా అదనపు రుసుము లేకుండా తీసుకెళ్లే వీలుంది. అదనపు రుసుముతో 150 కిలోల దాకా తీసుకెళ్లొచ్చు. ఏసీ రెండో తరగతి ప్రయాణికులు 60 కిలోలు, అదనపు రుసుముతో 100 కిలోల దాకా తీసుకెళ్లొచ్చు. ఏసీ మూడో తరగతి, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు 50 కిలోల దాకా లగేజీని తీసుకెళ్లే వీలుంది. అదనపు రుసుముతో 80 కిలోల దాకా తీసుకెళ్లొచ్చు. జనరల్ ప్రయాణికులు 45 కిలోల దాకా బరువున్న సామాను తీసుకెళ్లొచ్చు. అదనపు రుసుముతో 70 కిలోల దాకా తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని జాతీయ రాజధాని ప్రాంత జోన్‌లోని ప్రయాగరాజ్ జంక్షన్, ప్రయాగరాజ్ ఛివ్‌కి, సుబేదార్ గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, టుండ్లా, అలీగఢ్ జంక్షన్, గోవింద్‌పురి, ఇటావా స్టేషన్లలో అమలు చేయనున్నారు.