Share News

Indian Railways Hikes Ticket: రైలు టికెట్ల ధరల పెంపు!

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:48 AM

రైలు ప్రయాణికుల చార్జీలు పెంచుతూ.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలో మీటరుకు 1 నుంచి రెండు పైసల చొప్పున పెంచుతున్నట్టు తెలిపింది....

Indian Railways Hikes Ticket: రైలు టికెట్ల ధరల పెంపు!

  • కిలో మీటరుకు 1-2 పైసలు చొప్పున పెంచిన రైల్వే శాఖ.. ఈ నెల 26 నుంచే అమలు

  • 215 కి.మీ.లోపు ప్రయాణానికి ఎలాంటి పెంపూ వర్తించదు

న్యూఢిల్లీ, డిసెంబరు 21: రైలు ప్రయాణికుల చార్జీలు పెంచుతూ.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలో మీటరుకు 1 నుంచి రెండు పైసల చొప్పున పెంచుతున్నట్టు తెలిపింది. ఈ పెంపు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. తద్వారా రైల్వేకు రూ.600 కోట్ల మేరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని వివరించింది. 215 కిలోమీటర్ల దూరాన్ని మించి ప్రయాణించే వారికే ఈపెంపు వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ రైళ్లలో 215 కిలో మీటర్లు దాటి ప్రయాణించే వారికి.. కిలోమీటరుకు 1 పైసా చొప్పున, మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారికి కిలో మీటరుకు 2 పైసల చొప్పున టికెట్‌ ధరలు పెరగనున్నాయి. నాన్‌ఏసీ రైళ్లలో 500 కి.మీ. దూరం ప్రయాణించేవారు.. రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, సబర్బన్‌, నెలవారీ సీజన్‌ టికెట్‌లు తీసుకునే వారికి ఈ పెంపు వర్తించదు. కాగా.. ఈ ఏడాదిలో టికెట్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో పెంచిన టికెట్‌ ధరలతో శాఖకు రూ.700 కోట్లకుపైగా అదనపు ఆదాయం చేకూరింది. కాగా, క్రిస్మస్‌, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 8 జోన్లలో 244 అదనపు రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించింది. 2014-25 మధ్య కాలంలో 2 లక్షల వ్యాగన్లను సమకూర్చుకున్నట్టు శాఖ వివరించింది. అదేవిధంగా 10 వేలకుపైగా లోకోమోటివ్‌లను పెంచినట్టు తెలిపింది.


సిబ్బంది ఏరీ?

డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌(డీఎ్‌ఫసీ) ఏర్పాటుకు కేంద్రం ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈవ్యవహారంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. తగిన సిబ్బంది లేకుండా.. డీఎ్‌ఫసీ ప్రయోగం ఎందుకని ప్రశ్నించింది. నిపుణులైన సిబ్బంది డీఎ్‌ఫసీకి అవసరమని పేర్కొంది. కానీ, ప్రస్తుతం సిబ్బంది లేరని.. ఇది ప్రధాన సవాలుగా మారుతుందని అభిప్రాయపడింది. డీఎ్‌ఫసీ కింద హైకెపాసిటీ ట్రాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా మరింత సమర్థవంతంగా, వేగంగా రైళ్లను నడపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే.. లక్ష్యం బాగున్నా సిబ్బంది లేకపోవడాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుబట్టింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. లోకో పైలట్లు 1,42,814 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 1,07,928 మంది మాత్రమే ఉన్నారు. గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్లు 22,082 మంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 12,345 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా స్టేషన్‌ మాస్టర్లు 2,06,495 మంది ఉండాల్సి ఉండగా.. 1,59,219 మంది మాత్రమే ఉన్నారు. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని స్థాయీ సంఘం స్పష్టం చేసింది.

విభాగాల వారీగా పెంపు ఇలా..

  • సబర్బన్‌, నెలవారీ సీజన్‌ టికెట్లకు ఎలాంటి పెంపూ లేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీ. వరకు ఎలాంటి పెంపూ ఉండదు.

  • 215 కి.మీ. మించితే మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాన్‌ఏసీ తరగతుల వారికి పైసా చొప్పున పెంపు. ఏసీ క్లాస్‌కు కి.మీ.కు 2 పైసలు చొప్పున పెంపు.

  • నాన్‌ ఏసీ 500 కి.మీ. దూరానికి రూ.10 చొప్పున అదనం.

Updated Date - Dec 22 , 2025 | 04:48 AM