Ramon Magsaysay Award: ‘ఎడ్యుకేట్ గర్ల్స్’కు మెగసెసే అవార్డు
ABN , Publish Date - Sep 01 , 2025 | 05:18 AM
మారుమూల గ్రామాల్లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన భారతీయ స్వచ్ఛంద సంస్థను ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు వరించింది. ఆసియాలో నోబెల్ బహుమతికి సమానమైనదిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు-2025లను ఆదివారం ప్రకటించారు.
ఈ పురస్కారం దక్కించుకున్న తొలి భారతీయ సంస్థ
పల్లెల్లో బాలికల విద్య కోసం విశేష కృషి
దేశవ్యాప్తంగా 30 వేల గ్రామాల్లో ఆడపిల్లల అక్షరాస్యత పెంపు
మనీలా, ఆగస్టు 31: మారుమూల గ్రామాల్లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన భారతీయ స్వచ్ఛంద సంస్థను ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు వరించింది. ఆసియాలో నోబెల్ బహుమతికి సమానమైనదిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు-2025లను ఆదివారం ప్రకటించారు. ఆసియా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడంలో ప్రదర్శించే గొప్ప స్ఫూర్తికి గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరిస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ సంస్థగా ‘ది ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్’ చరిత్ర సృష్టించిందని రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్(ఆర్‌ఎంఏఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘సఫీనా హుస్సేన్ స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. బాలికలు, యువతులను నిరక్షరాస్యత నుంచి బంధవిముక్తం చేసేందుకు, పూర్తి మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు వారిలో నైపుణ్యాలు, ధైర్యం పెంపొందించేందుకు ఈ సంస్థ నిబద్ధతతో పనిచేసింది’’ అని ప్రశంసించింది.
మాల్దీవులలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన షాహీనా అలీ, ఫిలిప్పీన్స్‌లో పేదలు, అణగారిన వర్గాల గౌరవం కోసం పని చేసిన ఫ్లావియానో ఆంటోనియో ఎల్ విల్లానుయెవా కూడా ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డులు దక్కించుకున్నారు. నవంబరు 7న మనీలాలోని మెట్రోపాలిటన్ థియేటర్‌లో 67వ రామన్ మెగసెసే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆర్‌ఎంఏఎఫ్ చైర్‌పర్సన్ ఎడ్గర్ ఓ చువా తెలిపారు. సఫీనా హుసేన్ 2007లో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను స్థాపించారు. తొలుత రాజస్థాన్‌లో ఈ సంస్థ కృషిని ప్రారంభించింది. 50 గ్రామాల్లో పైలట్ స్కూళ్లను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 30వేల వరకూ అత్యంత మారుమూల గ్రామాలను చేరుకొంది. సుమారు 20 లక్షల మంది బాలికలకు విద్యనందించింది.