Share News

Wing Commander Namansh Syal: తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..

ABN , Publish Date - Nov 22 , 2025 | 10:58 AM

దుబాయ్‌‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్-ఎమ్‌కే1 ప్రమాదానికి గురై పేలిపోయింది. వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు.

Wing Commander Namansh Syal: తేజస్ ప్రమాదం.. ఇంతకీ ఎవరీ నమాన్ష్..
Wing Commander Namansh Syal

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్-ఎమ్‌కే1 దుబాయ్‌ ఎయిర్‌షోలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అల్‌ మక్తూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్లోకి లేచిన తేజస్‌, నింగిలో విన్యాసాలు చేస్తుండగానే నేరుగా కిందికి జారింది. నేలపై పడి పేలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రమాదం జరిగింది. తేజస్ కుప్పకూలిన ఘటనలో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. నమాన్ష్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది.


ఇంతకీ ఎవరీ నమాన్ష్..

34 ఏళ్ల నమాన్ష్ స్యాల్ హిమాచల్ ప్రదేశ్, కంగ్ర జిల్లాలోని పఠియాల్కర్ గ్రామంలో పుట్టారు. తండ్రి జగర్‌నాథ్ స్యాల్ కూడా ఇండియన్ ఆర్మీలో పని చేశారు. నమాన్ష్ సుజన్‌పూర్‌లోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. తండ్రి బాటలోనే నిమాన్ష్ కూడా ఆర్మీ వైపు వచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. ప్రస్తుతం వింగ్ కమాండర్‌గా ఉన్నారు. ఆయనకు భార్య, ఓ కూతురు ఉన్నారు. నిమాన్ష్ భార్య కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేస్తోంది. ఆయన తల్లిదండ్రులు కోయంబత్తూరులోని సూలురు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్నారు.


ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఆయిల్ లీక్ కారణంగా తేజస్ కుప్పకూలిందని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో తేజస్ ప్రమాదంపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ బృందం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. పీఐబీ ప్రకారం.. తేజస్‌ నుంచి ఏ దశలోనూ ఆయిల్‌ లీకేజీ జరగలేదు. వీడియోల్లో తేజస్‌ ల్యాండింగ్‌ వీల్స్‌ వద్ద కనిపిస్తున్న ద్రవం విమానం టేకాఫ్‌కు ముందు సహజంగా నిర్వహించే డ్రెయినింగ్‌ ప్రక్రియలో భాగంగా బయటపడిందేనని పేర్కొంది. తేజ్‌స్‌లో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని పీఐబీ బృందం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

తమ్ముడిని చంపిన అన్న .. కారణం ఏంటంటే..

Updated Date - Nov 22 , 2025 | 11:00 AM