Aadhaar as Global Model: ఆధార్ ఆదర్శం కాదు!
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:52 AM
పౌరుల గుర్తింపునకు సంబంధించి భారత్ అమలుపరిచిన ఆధార్‌ను.. ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచబ్యాంకు చేపట్టిన ఐడీ4డీ ప్రాజెక్టును పలువురు భారతీయ ప్రముఖులు....
దాంతో భారత్‌లో అనేక సమస్యలు.. ఈ విధానాన్ని అమలు చేయొద్దు
అంతర్జాతీయ సమాజానికి భారతీయ ప్రముఖులు, సంస్థల సూచన
న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పౌరుల గుర్తింపునకు సంబంధించి భారత్ అమలుపరిచిన ఆధార్‌ను.. ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచబ్యాంకు చేపట్టిన ఐడీ4డీ ప్రాజెక్టును పలువురు భారతీయ ప్రముఖులు, సంస్థలు తప్పుబట్టాయి. ఆధార్‌తో భారత్‌లో పలు సమస్యలు తలెత్తాయని, ఈ తరహా విధానాన్ని అమలు చేయవద్దని కోరాయి. ఈ మేరకు అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశాయి. దీని మీద 50కిపైగా కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, 200 మందికిపైగా ప్రముఖులు సంతకాలు చేశారు. భారీ ప్రచారం మధ్య 2009లో ఆధార్‌ను తీసుకొచ్చారని, తొలిరోజుల్లో ఇది స్వచ్ఛందమేగానీ తప్పనిసరి కాదని చెప్పారని ప్రకటనలో గుర్తు చేశారు. ప్రస్తుతం పౌరులందరికీ ఆధార్ తప్పనిసరి అన్న పరిస్థితి ఉందన్నారు. ఆధార్ పేరుతో కోట్లాదిమంది ప్రజల వివరాలు, ఫొటో, బయోమెట్రిక్ వివరాలు సేకరించారని, దేశంలో ఒక నియంతృత్వ ప్రభుత్వం ఉంటేగనుక.. ఈ వివరాలన్నీ ప్రజల్ని నియంత్రించటానికి ఒక సాధనంగా ఉపయోగపడతాయని హెచ్చరించారు. ఆధార్‌తో దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను, వ్యక్తుల బ్యాంకు ఖాతాల వంటి ప్రైవేటు వ్యవహారాలను కూడా అనుసంధానించారని.. ఇది ప్రజలపై నిఘాకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. సమాచారాన్ని కేంద్రీకరించటం వల్ల.. ఏదైనా సాంకేతి క సమస్య తలెత్తితే యావత్ సమాచార వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని చెప్పారు. పౌరుల ఆధార్‌కార్డుల్లోని వివరాలను ఆధార్ కేంద్రాల నిర్వాహకుల వంటి వారు సులువుగా చూడగలుగుతున్నారని, ఇది వ్యక్తుల గోప్యతకు భంగకరమని పేర్కొన్నారు. ఆధార్ నమోదులో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్దుకునే ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని వివరించారు. ఆధార్ వల్ల అవినీతి తగ్గుతుందన్న లక్ష్యం నెరవేరలేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలనూ ఆధార్‌తో అనుసంధానించటం వల్ల కొత్త తరహా మోసాలకు ఆస్కారం కల్పించినట్లయిందన్నారు. ప్రభుత్వ నియంత్రణ, నిఘా వంటి వాటికి అవకాశం లేకుండా పలు దేశాల్లో పౌరుల గుర్తింపు వ్యవస్థలు కొనసాగుతున్నాయని, ఆధార్ కంటే అవి మేలైనవని సూ చించారు. ఈ ప్రకటన మీద సంతకాలు చేసిన వారిలో ఆనంద్ పట్వర్ధన్, ఆనంద్ తేల్‌తుంబ్డే, అరుంధతీ రాయ్, బెజవాడ విల్సన్, జస్టిస్ ఏపీ షా, పీ సాయినాథ్, టీఎం కృష్ణలతోపాటు పీయూసీఎల్, మంజీరా దళిత సేవా సమితి, ఐద్వా, ఏఐఎ్‌సఏ తదితర సంఘాలున్నాయి.