Share News

Indian Army: సైన్యానికి త్రీడీ బంకర్లు

ABN , Publish Date - Dec 07 , 2025 | 04:30 AM

భారత సైన్యం, హైదరాబాద్‌ ఐఐటీ కలిసి సరిహద్దుల్లో త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో మిలిటరీ బంకర్లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

Indian Army: సైన్యానికి త్రీడీ బంకర్లు

హైదరాబాద్‌ ఐఐటీ స్టార్టప్‌ ఆవిష్కరణ.. రోబోటిక్‌ హస్తంతో త్రీడీ ప్రింటింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 6: భారత సైన్యం, హైదరాబాద్‌ ఐఐటీ కలిసి సరిహద్దుల్లో త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో మిలిటరీ బంకర్లను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. బంకర్‌ నిర్మించదలచుకున్న సైట్‌ వద్దకే నేరుగా రోబోటిక్‌ ప్రింటర్‌ను తీసుకెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అప్పటికప్పుడు అక్కడ నిర్మించాల్సిన బంకర్లను డిజైన్‌ చేస్తారు. వెంటనే త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో బంకర్‌ను సైట్‌లోనే బ్లాక్‌లుగా ప్రింట్‌ చేస్తారు. అక్కడే క్యూరింగ్‌ చేసి, బ్లాక్‌లను జతచేసి బంకర్‌ను నిర్మిస్తారు. 14 గంటల్లో బ్లాక్‌ల ప్రింటింగ్‌ పూర్తవుతుంది. 5 రోజుల్లో వాటిని క్యూరింగ్‌ చేసి, బంకర్‌ నిర్మాణం కూడా పూర్తి చేస్తారు. లద్దాఖ్‌లోని లేహ్‌ ప్రాంతంలో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తున త్రీడీ బంకర్‌ను కాంక్రీట్‌ ప్రింటింగ్‌ చేసి, బ్లాక్‌లను అసెంబుల్‌ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగిన త్రీడీ ప్రింటింగ్‌ బంకర్‌ నిర్మాణం. ఐఐటీలో భాగంగా ఉన్న స్టార్టప్‌ సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌, మిలిటరీలో భాగంగా ఉన్న త్రిశక్తి కోర్‌ కలిసి తొలి త్రీడీ ప్రింటింగ్‌ బంకర్‌ను నిర్మించాయి.


స్థానిక మెటీరియల్‌తోనే

త్రీడీ ప్రింటింగ్‌కు ఉద్దేశించిన యంత్రాన్ని వాహనం మీద అమర్చారు. దాంతో దాన్ని నేరుగా నిర్మాణ స్థలానికే తీసుకెళ్లి అక్కడే బ్లాక్‌లుగా త్రీడీ ప్రింటింగ్‌ చేయవచ్చు. ప్రతీ బ్లాక్‌ను కంప్యూటర్‌లో నిర్దేశించిన డిజైన్‌ ప్రకారం యంత్రంలోని రోబోటిక్‌ హస్తం పొరలు పొరలుగా కాంక్రీట్‌ మెటీరియల్‌తో పోస్తుంది. బ్లాక్‌లు జత చేస్తే గోడలు, పైకప్పు పూర్తవుతుంది. కొండల్లో కూడా నిర్విఘ్నంగా చేయగలగడం ఈ పోర్టబుల్‌ యంత్రం గొప్పదనం. అత్యంత ఎత్తులో, ఆక్సిజన్‌ తక్కువగా, జీరో కన్నా తక్కువ డిగ్రీల వాతావరణంలోనూ నిర్విఘ్నంగా ఈ యంత్రంతో పని చేయించవచ్చు. గతంలో బంకర్ల నిర్మాణానికి వారాలు పట్టేది. అవి, అంత సౌకర్యంగా కూడా ఉండేవి కాదు. ప్రీకాస్ట్‌ బ్లాక్‌లను కిందనుంచి కొండ మీదకు తీసుకెళ్లడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. త్రీడీ ప్రింటింగ్‌ అవడం వల్ల బంకర్‌ మొత్తం ఒకే మందంతో ధృఢంగా ఉంటోంది. స్థానికంగా దొరికే సిమెంట్‌ కంకరనే వాడతారు. దాంతో ఖర్చు బాగా తగ్గిపోతోంది. త్రీడీ బంకర్ల ధృధత్వాన్ని ఇప్పటికే పేలుడు పదార్థాల ద్వారా పరీక్షించారు. తక్కువ కాలంలో ఎక్కువ బంకర్లను నిర్మించే అవకాశం ఉండటం వల్ల భారత సైనికులకు మునపటి కన్నా మెరుగైన రక్షణ లభిస్తుంది. ఈ టెక్నాలజీతో విపత్తుల సమయంలో బాధితులకు వేగంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం వీలు కుదురుతుంది.

Updated Date - Dec 07 , 2025 | 04:31 AM