Share News

Martlet Missiles: భారత సైన్యానికి మార్ట్‌లెట్‌లు

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:10 AM

భారత సైన్యానికి బ్రిటన్‌కు చెందిన అధునాతన క్షిపణులు సమకూరనున్నాయి. ఈ మేరకు ఇరుదేశాల మధ్య రూ.4151 కోట్ల విలువైన..

Martlet Missiles: భారత సైన్యానికి మార్ట్‌లెట్‌లు

  • బ్రిటన్‌కు చెందిన అధునాతన క్షిపణుల కొనుగోలు

  • యూకేతో రూ.4151 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 10: భారత సైన్యానికి బ్రిటన్‌కు చెందిన అధునాతన క్షిపణులు సమకూరనున్నాయి. ఈ మేరకు ఇరుదేశాల మధ్య రూ.4151 కోట్ల విలువైన కీలక రక్షణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మార్ట్‌లెట్‌లుగా పిలిచే ‘వివిధ రకాల లక్ష్యాలను ఛేదించగల తేలికపాటి క్షిపణుల (ఎల్‌ఎంఎం)’లను భారత్‌ కొనుగోలు చేయనుంది. ఈ మార్ట్‌లెట్‌ క్షిపణులను ఐర్లాండ్‌లోని బెల్‌ఫా్‌స్టకు చెందిన ‘థేల్స్‌ ఎయిర్‌ డిఫెన్స్‌’ సంస్థ అభివృద్ధి చేస్తోంది. పురాణాల్లో ఉండే ‘మార్ట్‌లెట్‌’ అనే పక్షి పేరును ఈ క్షిపణులకు పెట్టారు. అలుపెరగని పక్షి అని దీని అర్థం. ఇవి తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణులు. వీటిని గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, భూతలం నుంచి భూతలం, భూతలం నుంచి గగనతలం దాడులకు ఉపయోగించుకోవచ్చు. గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు డ్రోన్లు, సాయుధ వాహనాలు వంటి మిలటరీ లక్ష్యాలను కూడా ఛేదించేలా వీటిని రూపొందించారు. లేజర్‌ బీమ్‌ గైడెన్స్‌తో పనిచేసే ఈ క్షిపణులను సైనికులు భుజంపై ఉంచుకొని ప్రయోగించే వీలు కూడా ఉంటుంది. సాయుధ వాహనాలకు అనుసంధానం చేసి, హెలికాప్టర్లు, నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇవి ఆరు కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. 13 కిలోల బరువుండే ఈ మార్ట్‌లెట్‌ క్షిపణులు ధ్వని వేగం కంటే ఒకటిన్నర రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. వీటిని 2019 నుంచి బ్రిటన్‌ సైన్యంలో వాడుతున్నారు. ఇవే క్షిపణులను యూకే ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ వీటిని వినియోగిస్తోంది. కాగా, భారత్‌-యూకే మధ్య విస్తృత ఆయుధాల ఒప్పందం కుదిరేందుకు తాజా క్షిపణి ఒప్పందం దారి చూపినట్లయిందని బ్రిటన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే యూకేలో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, క్రియేటివ్‌ పరిశ్రమ తదితర రంగాల్లో 64 భారత కంపెనీలు రూ.15,430 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయని.. వీటి ద్వారా దాదాపు 7 వేల ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది.

Updated Date - Oct 11 , 2025 | 05:10 AM