Share News

New Jet Engines with Full French Technology: యుద్ధ విమానాలకు ఇక దేశీ ఇంజన్లు!

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:06 AM

భారత దేశం అభివృద్ధి చేస్తున్న ఐదో తరం యుద్ధవిమానం ఆమ్కా అడ్వాన్స్‌డ్‌ మల్టీ రోల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ కు అవసరమైన 120-140 కిలోన్యూటన్‌ ఇంజన్‌ టెక్నాలజీని 100ు బదిలీ చేయడానికి ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం....

New Jet Engines with Full French Technology: యుద్ధ విమానాలకు ఇక దేశీ ఇంజన్లు!

  • ఐదో తరం ఫైటర్‌ జెట్‌ ఆమ్కాకు అవసరమైన ఇంజన్‌ టెక్నాలజీని 100 శాతం బదిలీ చేసేందుకు సిద్ధమైన ఫ్రెంచ్‌ సంస్థ శాఫ్రాన్‌

న్యూఢిల్లీ, నవంబరు 26: భారత దేశం అభివృద్ధి చేస్తున్న ఐదో తరం యుద్ధవిమానం ఆమ్కా (అడ్వాన్స్‌డ్‌ మల్టీ రోల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌)కు అవసరమైన 120-140 కిలోన్యూటన్‌ ఇంజన్‌ టెక్నాలజీని 100ు బదిలీ చేయడానికి ఫ్రెంచ్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం ‘శాఫ్రాన్‌’ అంగీకరించింది. డీఆర్‌డీవోతో కలిసి తాము ఒక సరికొత్త ఇంజిన్‌ను భారత్‌లోనే తయారుచేయబోతున్నామని.. శాఫ్రాన్‌ సీఈవో ఒలివియర్‌ ఆండ్రీస్‌ తెలిపారు. అత్యంత కీలకమైన హాట్‌ సెక్షన్‌ సహా.. ఇది పూర్తిస్థాయి టెక్నాలజీ బదిలీ అని, భారత్‌కు మరెవ్వరూ ఇలాంటి ఆఫర్‌ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. హాట్‌ సెక్షన్‌ అంటే.. విమానం ఇంజన్‌కు హృదయం లాంటిది. డీఆర్‌డీవోకు చెందిన గ్యాస్‌ టర్బైన్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (జీటీఆర్‌ఈ)తో కలిసి ఆ సంస్థ కొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం దాదాపు రూ.62,450 కోట్లతో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేయనుంది. కాగా.. ఆమ్కా ఎం2కేలకే కాక.. భవిష్యత్తులో తయారుచేసే ట్విన్‌ ఇంజన్‌ స్టెల్త్‌ యుద్ధవిమానాలకు సైతం ఉపయోగపడేలా ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆమ్కా అభివృద్ధి, ఉత్పత్తిలో భాగం కావడానికి.. టాటా గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టీ, అదానీ డిఫెన్స్‌ ఇప్పటికే ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం మనదేశం వద్ద ఉన్న అన్ని యుద్ధవిమానాలకూ విదేశీ ఇంజన్లనే వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధవిమానాల తయారీ, నిర్వహణలో గణనీయమైన ఖర్చు ఇంజన్లకే అవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు దేశీయంగా అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే.. భారతదేశం ‘ప్రాజెక్ట్‌ కావేరీ’ పేరిట సొంతంగా యుద్ధవిమాన ఇంజన్‌ తయారీకి ప్రయత్నించింది. ఆ ఇంజన్‌ను తేజస్‌ కోసం డిజైన్‌ చేశారు. కానీ తేజ్‌సకు కావాల్సింది 90 కిలోన్యూటన్‌ థ్రస్ట్‌ కాగా.. కావేరీ ఇచ్చింది 70 కిలోన్యూటన్‌ కంటే తక్కువ థ్రస్ట్‌ (మిగ్‌కు దాదాపు సమానం). యుద్ధవిమాన ఇంజన్లలో అత్యంత కీలకమైన హాట్‌ సెక్షన్‌లో గాలి ఉష్ణోగ్రత 1600 డిగ్రీల నుంచి 1900 డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉంటుంది. ఆ వేడిని తట్టుకునే టెక్నాలజీలు మనవద్ద లేకపోవడంతో కావేరీ ఇంజన్లు తగినంత థ్రస్ట్‌ ఇవ్వలేకపోయాయి. అందుకే తేజస్‌ తయారీకి జీఈ ఇంజన్లను వాడుతున్నారు (కావేరీ ఇంజన్లను మానవరహిత విమానాలకు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం). ఇప్పుడు శాఫ్రాన్‌ సంస్థ ఈ హాట్‌ సెక్షన్‌కు సంబంధించిన టెక్నాలజీలన్నింటినీ పూర్తిగా ఇస్తానంటోంది. కేవలం టెక్నాలజీ బదిలీయే కాక.. జీటీఆర్‌ఈతో కలిసి 100 శాతం భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్టు ఆండ్రీస్‌ వెల్లడించారు.


ఎయిర్‌ టు గ్రౌండ్‌ ఆయుధాల తయారీకి బెల్‌తో జాయింట్‌ వెంచర్‌

విమానం నుంచి నేలపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ‘ఎయిర్‌ టు గ్రౌండ్‌’ ఆయుధాల తయారీకి తాము భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)తో జాయింట్‌ వెంచర్‌ చేపట్టనున్నట్టు శాఫ్రాన్‌ సీఈవో ఆండ్రీస్‌ బుధవారం ప్రకటించారు. తమ వాణిజ్య విమాన కార్యక్రమానికి భారత్‌ ప్రధాన ప్రాంతంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌ వంటి విపత్తులు, జియోపాలిటిక్స్‌ వల్ల సరఫరా చైన్లలో అంతరాయాల వంటి సమస్యల నుంచి, మానుఫ్యాక్చరింగ్‌ రిస్క్‌ నుంచి తప్పించుకోవడానికే భారత్‌ను తమ ప్రధాన హబ్‌గా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ.. ఎయిర్‌బస్‌ 320, బోయింగ్‌ 737 మ్యాక్స్‌ వంటి విమానాల్లో వాడే లీప్‌ ఇంజన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఒక ప్లాంట్‌ను ప్రారంభించింది. భారత్‌లో ఇండిగో, ఎయిరిండియా, ఆకాశ వంటి విమానయాన సంస్థలు చాలావరకూ లీప్‌ ఇంజన్లున్న విమానాలనే వినియోగిస్తాయి. గతంలో ఆయా విమానాలకు మరమ్మతులు వస్తే విదేశాలకు పంపాల్సి వచ్చేది.

Updated Date - Nov 27 , 2025 | 04:06 AM