India Successfully Tests Agni 5 Missile: అగ్ని 5 క్షిపణి పరీక్ష సక్సెస్
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:49 AM
దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి...
న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్ష చేపట్టినట్టు రక్షణ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 క్షిపణి అన్ని సాంకేతిక, కార్యచరణ పరిమితులను అందుకున్నట్టు ప్రకటించాయి. అగ్ని-5 అనేది డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. భారత్ వద్ద ఉన్న అగ్ని శ్రేణిలో ఇది అత్యంత అధునాతన మిస్సైల్. ఇది 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించగలదు.