India China Relations: చైనా నిపుణులకు నెలలోనే వీసాలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:11 AM
చైనా పౌరులకు బిజినెస్ వీసాల జారీ గడువును భారత ప్రభుత్వం తగ్గించింది. ఇకపై నాలుగు వారాల్లోనే వీరి దరఖాస్తులను పరిశీలించి....
దరఖాస్తుల పరిశీలన గడువును తగ్గించిన భారత్
న్యూఢిల్లీ, డిసెంబరు 12: చైనా పౌరులకు బిజినెస్ వీసాల జారీ గడువును భారత ప్రభుత్వం తగ్గించింది. ఇకపై నాలుగు వారాల్లోనే వీరి దరఖాస్తులను పరిశీలించి, వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాల్లో అనవసర జాప్యం తగ్గి వేగం పెరుగుతుందని పేర్కొన్నాయి. 2020లో గల్వాన్ లోయలో రెండుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత చైనా పౌరుల వీసా దరఖాస్తుల జారీని భారత ప్రభుత్వం కఠినతరం చేసింది. ఇటీవల అమెరికా అఽధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై 50ు ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మళ్లీ తమ మధ్య సంబంధాలను మెరుగుపర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల వీసా దరఖాస్తులపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లోతైన పరిశీలనా విధానాన్ని ఉపసంహరిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు.