India US Defense Deal: అమెరికాతో రూ.7,995 కోట్ల రక్షణ ఒప్పందం
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:23 AM
భారత నౌకాదళంలో ఉన్న అమెరికా తయారీ ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల ఫ్లీట్ నిర్వహణ కోసం ఆ దేశంతో ఒప్పందంపై భారత్ సంతకం చేసింది...
న్యూఢిల్లీ, నవంబరు 28: భారత నౌకాదళంలో ఉన్న అమెరికా తయారీ ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల ఫ్లీట్ నిర్వహణ కోసం ఆ దేశంతో ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. భారత్‌పై అమెరికా అడ్డగోలు టారి్‌ఫల విధింపు తర్వాత ఇదే తొలి రక్షణ రంగ ఒప్పందం కావడం గమనార్హం. రూ.7,995 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా.. ఐదేళ్లపాటు ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ల నిర్వహణ, నిర్ణీత సమయాల్లో తనిఖీలు, మరమ్మతులు, విడిభాగాలు, ఇతర పరికరాల సరఫరా, శిక్షణ, సాంకేతిక సహకారాన్ని అమెరికా అందించనుంది. ఇందుకోసం భారత్‌లోనే పలు మౌలిక సదుపాయాలు కల్పించనుంది. దీనితో ఈ హెలికాప్టర్లు ఐదేళ్లపాటు నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండేందుకు వీలు కలుగుతుంది. అమెరికాతో ఈ ఒప్పందంపై రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సంతకాలు చేశారు. అమెరికా నుంచి 2011లో భారత్ 24 ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఎంహెచ్-60ఆర్ సీహాక్‌లు.. ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లలో కీలకమైనవి. క్లిష్టమైన వాతావరణంలోనూ సమర్థవంతంగా పనిచేయగలవు. కాగా, ఈ ఏడాది చివరినాటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాణిజ్య ఒప్పందంలో చాలా అంశాలపై భారత ప్రయోజనాలను కాపాడే దిశగా గట్టి ప్రయత్నాలు చేశామని, ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని తెలిపారు.