Share News

India Russia Tie: మా ఇంధనబంధం సుస్థిరం

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:11 AM

అమెరికా ఆంక్షలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కఠిన చర్యల వల్ల అంతర్జాయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా..

India Russia Tie: మా ఇంధనబంధం సుస్థిరం

  • ఎన్ని ఆంక్షలు ఉన్నా చెక్కుచెదరలేదు

  • భారత్‌తో ఇంధన వాణిజ్యంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 4: అమెరికా ఆంక్షలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కఠిన చర్యల వల్ల అంతర్జాయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. భారత్‌, రష్యా మధ్య ఇంధన సంబంధాలు చెక్కుచెదరలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఈ విశ్వాసం ఇలాగే బలంగా సుదీర్ఘ కాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత పర్యటన నేపథ్యంలో గురువారం ఆయన.. ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్‌, రష్యా సంబంధాలు, అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య పరిణామాలపై తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. రష్యానుంచి భారత్‌చమురు కొనుగోళ్లను ప్రభావితం చేయాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. చాలాకాలం క్రితమే రష్యా చమురు కంపెనీ రోస్‌నెఫ్ట్‌ భారత్‌లోని నయారా ఎనర్జీలో వాటాలు కొనుగోలు చేసిందని, ఆ పెట్టుబడి రెండుదేశాల మధ్య విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.

భారత ఎదుగుదల కొందరికి ఇష్టంలేదు

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారత ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతుండటం కొందరికి కంటగింపుగా మారిందని పుతిన్‌ విమర్శించారు. అందుకే వారు రాజకీయ కారణాలతో కృత్రిమ అవాంతరాలను సృష్టించి భారత ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలును నిరసిస్తూ అమెరికా అఽఽధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ఆంక్షలు, పశ్చిమదేశాల ఆందోళనలన్నీ అంతర్జాతీయ వాణిజ్యంలో భారదేశ బలం పెరుగుదలను సూచిస్తున్నాయి. ఈ రంగంలో భారతదేశ ప్రాబల్యం పెరగటం వారికి అసౌకర్యంగా ఉంది’ అని అన్నారు. అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. మోదీతో తనకు ఉన్న సాన్నిహిత్యం భారత్‌- రష్యా మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగేందుకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. దేశమే శ్వాసగా, ప్రాణంగా భావిస్తున్న ప్రధానిగా నరేంద్రమోదీ ఉండటం భారతదేశ అదృష్టమని పుతిన్‌ అన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆర్థిక, రక్షణ సహకారం.. మానవతా సంబంధాలు, అత్యాధునిక సాంకేతికత అభివృద్ధి వంటి అనేక రంగాల్లో భారత్‌తో సంబంఽధాలను బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

Updated Date - Dec 05 , 2025 | 02:11 AM