Global Delivery: అంతర్జాతీయంగా తపాలా పార్సిల్ సేవలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:48 AM
ఈ కామర్స్ ఎగుమతిదారులు, వ్యక్తిగత వినియోగదారుల కోసం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ..
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఈ-కామర్స్ ఎగుమతిదారులు, వ్యక్తిగత వినియోగదారుల కోసం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ పార్సిల్ సేవలను అందించడానికి తపాలా శాఖ కొత్తగా ‘ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్(ఐటీపీ) సర్వీ్‌స’ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా 45 దేశాలకు సులభంగా, నమ్మకంగా పార్సిళ్లు రవాణా చేయవచ్చని సంస్థ తెలిపింది. ఈమేరకు సోమవారం హైదరాబాద్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎన్.ఆర్. విశాలాక్షి పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సేవల్లో గరిష్ఠంగా 2 నుంచి 5 కిలోల వరకు (పంపించాల్సిన దేశం నిబంధనల ప్రకారం) తక్కువ ధరల్లో, సమయానికి డెలివరీ చేయనున్నామని తెలిపారు. వీటిని అన్ని పోస్టాఫీసుల్లో సులభంగా బుకింగ్ ద్వారా పొందవచ్చని, చిన్న పరిమాణంలోని అంతర్జాతీయ పంపిణీలకు ఇవి అనువైనవిగా ఉంటాయని తెలిపారు. పూర్తి దేశాల జాబితా, టారిఫ్ వివరాలు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 6309658112 / 9963617719 నంబర్లలో కార్యాలయ సమయాల్లో సంప్రదించవచ్చని తెలిపారు.