Indian defense strategy: పాకిస్థాన్ దిగ్బంధం
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:10 AM
పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఒంటరిగా మార్చేందుకు భారత్ వాయు, జల మార్గాలనూ మూసివేయాలని భావిస్తోంది. అదే సమయంలో పాక్ నిఘా చర్యలు, సైబర్ దాడులకు ఎదురుగా భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా స్పందిస్తోంది.
దాయాదిని అన్ని అంశాల్లో ఇరుకున పెట్టేందుకు కేంద్రం యత్నాలు
ఇప్పటికే అమల్లోకి దౌత్య, వాణిజ్యపరమైన ఆంక్షలు
పాక్ ఎయిర్‌లైన్స్‌కు భారత గగనతలాన్ని మూసేసే యోచన
ఆ దేశ నౌకలు మన పోర్టుల్లో ఆగకుండా చర్యలు
ఏ క్షణమైనా భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాక్ ఆందోళన
సరిహద్దులకు రాడార్ల తరలింపు.. సైబర్ దాడులకు విఫల యత్నం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్న దాయాది దేశం పాకిస్థాన్‌ను అన్ని అంశాల్లోనూ ఇరుకున పెట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే పాక్‌కు దౌత్యపరంగా స్థాయిని తగ్గించడం, వాణిజ్యాన్ని నిషేధించడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం... ఇకపై వాయు, జల మార్గాలనూ మూసేయాలని నిర్ణయించినట్టు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రస్థాయిలో స్పందించడంతో.. భారత విమానాలకు పాక్ తన గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అదే తరహాలో పాక్ విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలిసింది. దీనివల్ల పాకిస్థాన్ నుంచి తూర్పు వైపునకు.. అంటే మయన్మార్, థాయిలాండ్, మలేసియా వంటి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లాలంటే.. చైనా మీదుగా, లేదా శ్రీలంక మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అంత ఎక్కువ దూరం తిరగడం వల్ల పాక్ విమానయాన సంస్థలకు పెద్ద దెబ్బే తగలనుంది. మరోవైపు భారత పోర్టుల్లో పాకిస్థాన్ నౌకలు ఆగకుండా నిషేధం విధించాలని కూడా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
జమ్మూలో భద్రతపై ఎన్‌ఎ్‌సజీ డ్రిల్...
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు, మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చనే వార్తల నేపథ్యంలో.. జమ్మూలో భద్రతపై జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎ్‌సజీ), స్థానిక పోలీసులు కలసి భారీ స్థాయిలో డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై.. నిఘా డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో ఆప్ శంభు ఆలయం, రైల్వే స్టేషన్, జీఎంసీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే భారత్‌లో పాక్ ప్రభుత్వ అధికారిక ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేసిన కేంద్రం..తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఖాతాను కూడా నిలిపివేసింది.
భారత సరిహద్దుల్లోకి పాక్ నిఘా రాడార్లు..
భారత్ ఏ క్షణమైనా దాడికి దిగవచ్చన్న ఆందోళనతో ఉన్న పాకిస్థాన్.. తమ నిఘా రాడార్లను సరిహద్దులకు సమీపంలో తరలిస్తోంది. ఇప్పటికే సియాల్‌కోట్, ఫిరోజ్‌పూర్ సెక్టార్లలోకి రాడార్లను తరలించినట్టుగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల లోపల ఉన్న ఖోర్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధునాతన టీపీఎస్-77 మల్టీరోల్ రాడార్‌ను సైతం పాక్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఇక నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన కొనసాగుతోంది. సోమవారం రాత్రి కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ దళాలు కాల్పులు జరపగా.. భారత దళాలు దీటుగా బదులిచ్చినట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఆర్మీపై సైబర్‌దాడులకు పాక్ విఫల యత్నం
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ హ్యాకర్లు భారత ఆర్మీపై సైబర్‌దాడుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ‘ఐఓకే (ఇంటర్నఎట్ ఆఫ్ ఖిలాఫా) హ్యాకర్’గా పిలిచే పాక్ హ్యాకర్ల బృందం మంగళవారం.. వైమానిక దళ ప్లేస్‌మెంట్ పోర్టల్, శ్రీనగర్, రాణిఖేత్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లు, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూహెచ్‌ఓ) వెబ్‌సైట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే నిరంతర పర్యవేక్షణ ఉండే భారత ఆర్మీ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ ఆ ప్రయత్నాలను నిలువరించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.
‘పహల్గాం’పై చర్చకు పార్లమెంట్ నిర్వహించండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై చర్చించేందుకు వీలైనంత తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రధాన మంత్రిని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీకి మంగళవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతీ భారతీయుడిలో ఆవేశాన్ని రగిల్చింది. ఇలాంటి కఠిన సమయంలో.. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. అందువల్ల పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని ప్రతిపక్షం ఆశిస్తోంది. వీలైనంత త్వరగా ఆ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నా’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..