India: అభివృద్ధి భారత్
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:59 AM
భారతదేశంలో పేదరికం తగ్గినట్లుగా ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. గత పదేళ్లలో 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు, పేదరిక రేటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా తగ్గింది.
పదేళ్లలో 17 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు
పట్టణ, గ్రామాల మధ్య తగ్గుతున్న అంతరం..వరల్డ్ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో భారత్ దూసుకెళ్తోంది. దశాబ్దకాలంగా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయింది. గత పదేళ్లలో 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2011-12లో దేశ జనాభాలో 16.2 శాతం ప్రజలు దుర్భర పేదరికం (రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం)లో మగ్గగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.3 శాతానికి తగ్గినట్టు ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దుర్భర పేదరికంతో బాధపడుతున్నవారు పదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం 7.7 నుంచి 1.7 శాతానికి తగ్గింది. పేదలు క్రమేణా దిగువ-మధ్య-ఆదాయ కేటగిరీలోకి మారుతున్నారు. అలాగే దిగువ-మధ్య-ఆదాయ కేటగిరిలో ఉన్నవారు మధ్య తరగతి ఆదాయ కేటగిరిలోకి వెళ్తున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 69 శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణాల్లో 43.5 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం 25 నుంచి 15 శాతానికి తగ్గింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో భారత్ పురోగతి సాధిస్తోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2021-22 నుంచి యువత (శ్రామిక-వయసు జనాభా) కంటే వేగంగా ఉపాధి పెరుగుతోందని వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణుల్లో స్వయం ఉపాధి పెరుగుతోందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి తగ్గిందని, 2017-18 నుంచి ఇదే అతి తక్కువ అని వెల్లడించింది. ఉపాధి కోసం గ్రామీణ పురుషులు పెద్ద సంఖ్యలో పట్టణాల బాట పడుతున్నారని తెలిపింది. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల ఉపాధి మెరుగుపడినట్టు పేర్కొంది. దేశంలో మహిళల ఉపాధి రేటు 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్