India Launches National Plan 2.0: ఆపరేషన్ యాంటీబయాటిక్స్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:14 AM
ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్థమైంది. అత్యాధునిక యాంటీబయాటిక్....
నేషనల్ యాక్షన్ ప్లాన్ 2.0 విడుదల
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)ను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్థమైంది. అత్యాధునిక యాంటీబయాటిక్ మందులకూ లొంగని మొండి సూక్ష్మజీవులను (ఎంఎమ్‌ఆర్) అరికట్టేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. రాబోయే ఐదేళ్ల కాలానికి (2025-2029) సంబంధించి.. ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఎన్‌ఏపీ-ఏఎమ్‌ఆర్) 2.0’ను తాజాగా విడుదల చేసింది. కేంద్రం రూపొందించిన ఈ యాక్షన్ ప్లాన్ ప్రధానంగా ఆరు అంశాల ఆధారంగా పనిచేయనుంది.
విస్తృత అవగాహన: యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేయకూడదని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతారు. స్కూల్ పిల్లల నుంచి హెల్త్ వర్కర్ల వరకు అందరికీ దీనిపై అవగాహన కల్పిస్తారు.
పటిష్టమైన నిఘా: దేశవ్యాప్తంగా ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఏయే ప్రాంతాల్లో ఏ బ్యాక్టీరియా మందులకు లొంగడం లేదు? ఎక్కడ ఎక్కువ కేసులున్నాయి? అనే డేటాను ేసకరిస్తారు. .
ఇన్ఫెక్షన్ల నివారణ: ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా.. ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకకుండా చూస్తారు. దీనివల్ల మందుల వాడకం తగ్గుతుంది. మందుల వాడకంపై నియంత్రణ: వైద్యులు సిఫారసు చేసి, ప్రిస్ర్కిప్షన్ ఇస్తేనే ఔషధాలను అమ్మే విధానాన్ని తీసుకురానున్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మడాన్ని పూర్తిగా అరికడతారు.
పరిశోధనలు-ఆవిష్కరణలు: పాత మందులు పనిచేయడం లేదు కాబట్టి, కొత్త యాంటీబయాటిక్ ఔషధాలను, టీకాలను, తక్కువ ఖర్చుతో రోగాన్ని గుర్తించే కిట్లను తయారు చేయడంపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. సమన్వయం: ఇది ఒక్క ఆరోగ్య శాఖ పనే కాదు కాబట్టి... వ్యవసాయం, పశుసంవర్థక, పర్యావరణ శాఖలతో సమన్వయం చేస్తారు.