Share News

Rare Earth Magnet Manufacturing: అరుదైన ఖనిజాలకు 7,280 కోట్ల ఊతం

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:08 AM

అనేక రంగాల్లో వినియోగిస్తున్న అరుదైన భూ అయాస్కాంతాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది....

Rare Earth Magnet Manufacturing: అరుదైన ఖనిజాలకు 7,280 కోట్ల ఊతం

  • రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ తయారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం

న్యూఢిల్లీ, నవంబరు 26: అనేక రంగాల్లో వినియోగిస్తున్న అరుదైన భూ అయాస్కాంతాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.7,280 కోట్లతో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసింది. బుధవారం ప్రధాని న రేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ తయారీని ప్రోత్సహించే పథకానికి ఆమోదం లభించింది. దేశంలో వార్షికంగా 6,000 మెట్రిక్‌ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పాత్రికేయులకు తెలిపారు. ప్రధానంగా ఎలక్ర్టిక్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్‌, ఎలక్ర్టానిక్స్‌, వైద్య పరికరాలు, రక్షణ రంగంలో అరుదైన భూ అయాస్కాంతాలను వినియోగిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా గ్లోబల్‌ పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు తయారీదారులకు కేటాయించనున్నారు. ప్రతి తయారీదారుకు 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయిస్తారు. ఈ పథకం మొత్తం కాలపరిమితి ఏడేళ్లు. కేటాయించిన తేదీ నుంచి ఇది అమల్లో ఉంటుంది. మొదటి రెండేళ్లు ఇంటిగ్రేటెడ్‌ రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ (ఆర్‌ఈపీఎం) తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఉంటుంది. తర్వాతి ఐదేళ్లు ఆర్‌ఈపీఎం అమ్మకాలపై ప్రోత్సాహకాల పంపిణీ ఉంటుంది. అరుదైన భూ అయాస్కాంత మెటీరియల్స్‌ ఎగుమతుల నిబంధనలను చైనా కఠినతరం చేస్తున్న నేపథ్యంలో భారత పరిశ్రమలకు సరఫరా పరంగా సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం భారత్‌ ఆర్‌ఈపీఎం అవసరాలన్నీ దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. 2030 నాటికి డిమాండ్‌ రెండింతలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా పటిష్టవంతమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందడుగు వేసింది. ఆర్‌ఈపీఎంలు బలమైన మాగ్నెట్లు. వీటిని ప్రపంచవ్యాప్తంగా విరివిగా వినియోగిస్తున్నారు. వీటిని ఎలక్ర్టిక్‌ మోటార్లు, విండ్‌ టర్బైన్లు, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాల్లో వాడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతోపాటు పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుంది.

9,858 కోట్లతో పుణె మెట్రో విస్తరణకు ఆమోదం

రూ.9,858 కోట్లతో పుణె మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు ఐదేళ్లలో పూర్తికానుంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, బహుళ ఫండింగ్‌ ఏజెన్సీలు సంయుక్తంగా సమకూర్చనున్నాయి. కాగా రూ.2,781 కోట్ల విలువైన రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో గుజరాత్‌లోని ద్వారకా-కనాలస్‌ రైల్‌ లైన్‌ డబ్లింగ్‌తోపాటు ముంబైలోని బద్లాపూర్‌, కర్జాత్‌ మధ్య మూడు, నాలుగో లైన్ల నిర్మాణం ఉన్నాయి.

Updated Date - Nov 27 , 2025 | 04:08 AM