PM Modi: ఉగ్రవాద నిర్మూలనలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటాం
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:55 AM
ఉగ్రవాదాన్ని నిర్మూలించడం.. శాంతి స్థాపనలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఐరోపా సమాఖ్య, 33 దేశాలకు వివరించేందుకు...
అఖిలపక్ష బృందాల పనితీరుకు గర్విస్తున్నా: మోదీ
న్యూఢిల్లీ, జూన్ 10: ఉగ్రవాదాన్ని నిర్మూలించడం.. శాంతి స్థాపనలో భారత్ నిబద్ధతను ప్రపంచానికి చాటామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఐరోపా సమాఖ్య, 33 దేశాలకు వివరించేందుకు సిటింగ్ ఎంపీల నేతృత్వంలో ఏడు అఖిలపక్ష బృందాలు పర్యటించిన విషయం తెలిసిందే..! భారత్ తిరిగి వచ్చిన ఈ బృందాలతో ప్రధాని మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత గొంతుకను ప్రపంచ దేశాలకు చాటిన బృందాల పనితీరుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని తెలియజేయడంలో ఈ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు. అంతకు ముందు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. తమ పర్యటనలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇదిలా ఉండగా, గత 11 ఏళ్లలో దేశంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 12రెట్లు పెరిగాయని మోదీ తెలిపారు. 2014-15లో రూ.1,930 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతుల విలువ 2024-25నాటికి రూ.23,622 కోట్లకు చేరిందన్నారు.