Share News

Directorate General of Civil Aviation: కొత్త పైలట్‌ శిక్షణ వ్యవస్థపై భారత్‌ దృష్టి..

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:38 AM

దేశంలో కొత్త తరహా పైలట్‌ శిక్షణ వ్యవస్థను తీసుకొచ్చే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) వ్యవస్థ కొనసాగుతుండగా..

Directorate General of Civil Aviation: కొత్త పైలట్‌ శిక్షణ వ్యవస్థపై భారత్‌ దృష్టి..

  • మల్టీ క్రూ పైలట్‌ లైసెన్స్‌ను పరిశీలిస్తున్న డీజీసీఏ

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో కొత్త తరహా పైలట్‌ శిక్షణ వ్యవస్థను తీసుకొచ్చే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) వ్యవస్థ కొనసాగుతుండగా.. మల్టీ క్రూ పైలట్‌ లైసెన్స్‌ (ఎంపీఎల్‌) వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ అంశంపై తన వాటాదారులతో బుధవారం సమావేశం నిర్వహించింది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే.. సీపీఎల్‌, ఎంపీఎల్‌ రెండూ అందుబాటులో ఉంటాయి. భద్రత, తమ అవసరాలను బట్టి ఆపరేటర్లకు ఈ రెండింటిలో శిక్షణ పొందిన వారిని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో పైలట్‌ కావాలనుకునే వారు ముందుగా సీపీఎల్‌ చేయాలి. ఈ శిక్షణలో భాగంగా 200 గంటలపాటు విమానం నడిపిన అనుభవాన్ని గడించాలి. ఆ తర్వాత ఎయిర్‌బస్‌ ఏ320 లేదా బోయింగ్‌ 737 వంటి నిర్దిష్ట విమానాల్లో శిక్షణ పొందాలి. మరోవైపు ఎంపీఎల్‌ శిక్షణ తీసుకునేవారు దాదాపు 70 గంటలపాటు చిన్న శిక్షణ విమానం నడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పెద్ద విమానాల్లో 140 నుంచి 160 గంటలపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. తదనంతరం విమానయాన సంస్థలు వారిని ట్రైనీ పైలట్లుగా చేర్చుకుంటాయి. ‘మేం రెండు వ్యవస్థలను మూల్యాంకనం చేస్తున్నాం. అధిక శిక్షణతోపాటు విమానయాన సంస్థల అవసరాలను తీర్చడంలో ఏది ఉత్తమమో దాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. గతంలో కూడా ఎంపీఎల్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. దీన్ని మళ్లీ పరిగణించాలని ఒక అభ్యర్థన వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం’ అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే రెండు మూడేళ్లలో ఎంపీఎల్‌ అందుబాటులోకి వస్తుంది. అలాగే సీపీఎల్‌ కూడా కొనసాగుతుంది.

Updated Date - Aug 07 , 2025 | 05:40 AM