Share News

Fake Passports: నకిలీ పాస్‌పోర్టు, వీసాలపై కొరడా!

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:54 AM

నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో దేశంలోకి వచ్చినా, ఇక్కడే తిష్ఠవేసినా.. ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకున్నా ఇకపై కఠిన దండన తప్పదు.

Fake Passports: నకిలీ పాస్‌పోర్టు, వీసాలపై కొరడా!

  • మోసానికి పాల్పడితే కఠిన దండన

  • ఏడేళ్ల జైలు, 10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో దేశంలోకి వచ్చినా, ఇక్కడే తిష్ఠవేసినా.. ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకున్నా ఇకపై కఠిన దండన తప్పదు. నకిలీ పాస్‌పోర్టులు, వీసాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. నకిలీరాయుళ్లను గుర్తించి కఠినంగా శిక్షించనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదించిన ‘వలసదారులు, విదేశీయుల చట్టం-2025’ను సెప్టెంబరు 1 నుంచి(సోమవారం) అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. నకిలీలకు పాల్పడే వారికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని అత్యంత కఠినంగా అమలు చేయనున్నట్టు వ్యాస్‌ తెలిపారు. పార్లమెంటులో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఈ చట్టంలోని సెక్షన్‌-1లో పేర్కొన్న సబ్‌ సెక్షన్‌-2 ప్రకారం దీనిని సెప్టెంబరు 1 నుంచి కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది.


దాచేందుకు కుదరదు!

  • ఈ చట్టం ప్రకారం.. దేశంలోని వ్యాపార, వాణిజ్య సహా అన్ని సంస్థలు విదేశీయుల వివరాలను వెల్లడించాలి.

  • హోటళ్లు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు.. ఇలా అన్ని సంస్థలు కూడా.. తమ వద్దకు వచ్చే విదేశీయుల వివరాలను దాచడానికి వీల్లేదు.

  • ఇక, వీసాల గడువు తీరిపోయిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్నవారిని గుర్తించేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది.

  • విమానాలు, నౌకలలో ప్రయాణించే విదేశీయుల వివరాలను కూడా ఆయా సంస్థల కంపెనీలు వెల్లడించాలి. విదేశీయులు తరచుగా పర్యటించే పర్యాటక ప్రాంతాలపై పూర్తి నియంత్రణ కేంద్రానికే ఉంటుంది.

  • వలసలు, వీసా, పాస్‌పోర్టు, విదేశీయులు.. తదితర అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నాలుగు వేర్వేరు చట్టాలను రద్దు చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 01:54 AM