PM Modi: ప్రపంచ ప్రకృతి సాగు కేంద్రంగా భారత్
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:29 AM
ప్రపంచ ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా భారత్ ఉద్భవిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక, విస్తృత అవకాశంగా యువత గుర్తిస్తోందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. తమిళనాడులోని....
చెన్నై, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా భారత్ ఉద్భవిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక, విస్తృత అవకాశంగా యువత గుర్తిస్తోందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు రోజుల సదస్సును బుధవారం మధ్యాహ్నం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్, రైతు సంఘాల సమాఖ్య నాయకుడు పీఆర్ పాండ్యన్ తదితరులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటైన 17 స్టాళ్లను మోదీ ప్రారంభించారు. అనంతరం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ కింద రైతులకు 21వ విడతగా రూ.18 వేల కోట్లు విడుదల చేశారు. ప్రకృతి వ్యవసాయంలో విశిష్ట సేవలందించిన 10మంది రైతులకు ప్రధాని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం మన సంప్రదాయంలో పాతుకుపోయిందని, ఇది పర్యావరణానికి అనుకూలమని వ్యాఖ్యానించారు. ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (కేసీసీ) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ10 లక్షల కోట్లకు పైగా సహాయం అందిందని చెప్పారు. పీఎం-కిసాన్ పథకం కింద ఇప్పటి వరకూ 4 లక్షల కోట్లు నేరుగా చిన్న రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణ 21వ శతాబ్దపు వ్యవసాయ ఆవశ్యకత అని నొక్కిచెప్పారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, నేలను ఆరోగ్యంగా ఉంచడానికి, హానికరమైన రసాయనాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రకృతి వ్యవసాయం సహాయపడుతుందని ప్రధాని వివరించారు. దక్షిణ భారతదేశం వ్యవసాయానికి ఒక సజీవ విశ్వవిద్యాలయం అని, ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కొన్ని ఆనకట్టలకు నిలయంగా ఉందన్నారు. ‘ఒక ఎకరం- ఒక సీజన్’ విధానంలో రైతులు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు.