India Condemns Pakistan Army Chief: అణుబూచి పాక్‌కు మామూలే
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:05 AM
అణ్వస్త్ర బెదిరింపులు పాకిస్థాన్‌కు మామూలేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా పర్యటన సందర్భంగా.......
పాక్ ఆర్మీ చీఫ్ బెదిరింపులపై భారత్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: అణ్వస్త్ర బెదిరింపులు పాకిస్థాన్‌కు మామూలేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘‘మా ఉనికికే ప్రమాదం ఏర్పడితే.. భారత్‌పై అణుదాడి చేస్తాం. మేం మునిగిపోతూ.. సగం ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తాం’’ అంటూ మునీర్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే..! స్నేహపూర్వక దేశమైన అమెరికా గడ్డ పైనుంచి మునీర్ వ్యాఖ్యలు రావడం విచారకరమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘‘పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల ద్వారా ఆ దేశంలో అణ్వస్త్రాల నియంత్రణ, కమాండ్ వ్యవస్థ నైతికతపై ఉన్న అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఉగ్రవాద గ్రూపులతో పాక్ సైన్యం కలిపి పనిచేస్తోందన్న వాస్తవం మరోసారి స్పష్టమవుతోంది. అణ్వస్త్ర బ్లాక్ మెయిల్‌కి భారత్ తలొగ్గదు. అదే సమయంలో.. జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా మునీర్ వ్యాఖ్యలు బాధ్యతారహితానికి నిదర్శనమని పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. పాక్ సైన్యానికి అమెరికా మద్దతిస్తే.. పాక్ తన అసలు స్వరూపాన్ని, దూకుడును బయటపెడుతోందని పేర్కొంది.