భారత్-చైనా మధ్య మళ్లీ నేరుగా విమానాలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:44 AM
ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులను మళ్లీ నడిపే విషయంపై అంగీకారం కుదిరింది. వీసాలు, విమాన సర్వీసుల ప్రారంభ తేదీ తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది.
రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న చర్చలు
న్యూఢిల్లీ, జూన్ 13: ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులను మళ్లీ నడిపే విషయంపై అంగీకారం కుదిరింది. వీసాలు, విమాన సర్వీసుల ప్రారంభ తేదీ తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వైడోంగ్ భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. వైడోంగ్‌తో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమావేశమై చర్చలు జరిపారు. జనవరి 27న బీజింగ్ సమావేశంలో చర్చించిన అంశాలపై సమీక్షించారు.
ఈ ఏడాది కైలాస్ మానస్ సరోవర్ యాత్రలో చైనా అందిస్తున్న సహకారానికి మిస్రీ ధన్యవాదాలు తెలిపారు. సరిహద్దుల్లో ప్రవహించే నదులకు సంబంధించి రెండు దేశాల మధ్య సమాచార మార్పిడి జరగాలని కూడా నిర్ణయించారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పుడే రెండు దేశాల మధ్య నేరుగా నడిపే విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనాకు సంబంధించిన పలు యాప్‌లను భారత్ నిషేధించింది.