Transshipment Policy: బంగ్లాదేశ్ ఎగుమతులు భారత్ నుంచి వెళ్లకుండా నిషేధం
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:00 AM
భారత గుండా ఇతర దేశాలకు సరుకులు పంపుకునే బంగ్లాదేశ్ ట్రాన్స్‌షిప్ వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇటీవలి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలకు సరుకులు ఎగుమతి చేసుకునేలా బంగ్లాదేశ్‌కు గతంలో ఇచ్చిన వెసులుబాటు(ట్రాన్స్‌షి్‌పమెంట్)ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లాదేశ్ ఎగుమతులేవీ భారతదేశం గుండా వేరే దేశాలకు వెళ్లకుండా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్‌షి్‌పమెంట్ వెసులుబాటు కల్పిస్తూ 2020 జూన్ 29న భారత్ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను భారత్‌లోని ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టుల ద్వారా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు యూనస్ ఇటీవల చైనాలో పర్యటించినప్పుడు.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని, అవి భూపరివేష్ఠిత రాష్ట్రాలని అన్నారు. వాటికి తామే రక్షకులుగా ఉన్నామని చెప్పారు. వాటి చుట్టూ బంగ్లాదేశే ఉందన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా తన పట్టును పెంచుకోవడానికి చైనాకు మంచి అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ట్రాన్స్‌షి్‌పమెంట్‌ను భారత ప్రభుత్వం రద్దుచేసింది.