Indian Air Force: ముగిసిన మిగ్ శకం
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:46 AM
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతల రక్షణ భారాన్ని తన రెక్కలపై మోసిన...
మిగ్-21 ఫైటర్‌జెట్ సేవలకు వీడ్కోలు
చండీగఢ్, సెప్టెంబరు 26: భారత వాయుసేన (ఐఏఎఫ్)లో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతల రక్షణ భారాన్ని తన రెక్కలపై మోసిన మిగ్-21 శకం ముగిసింది. ఎన్నో యుద్ధాలు, ఆపరేషన్లలో భారత విజయపతాకాన్ని రెపరెపలాడించిన రష్యా తయారీ మిగ్-21 యుద్ధ విమానాలు వాయుసేన నుంచి గౌరవంగా రిటైరయ్యాయి. చండీగఢ్ ఎయిర్ బేస్‌లో శుక్రవారం జరిగిన డీకమిషన్ కార్యక్రమంలో వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. ఈ ఐకానిక్ యుద్ధ విమానాలకు ఘనంగా వీడ్కోలు పలికారు. 1963లో ఇదే ఎయిర్ బేస్ వేదికగా ఐఏఎ్‌ఫలోకి అడుగుపెట్టిన మిగ్-21లు.. ఇప్పుడు ఇక్కడే తన సేవలు ముగించడం విశేషం. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. మిగ్-21 బైసన్ యుద్ధ విమానం లో చివరిసారిగా ప్రయాణించి వీడ్కోలు పలికారు. ఆయనతోపాటు 23వ స్క్వాడ్ర న్ లీడర్ ప్రియాశర్మ కూడా ఉన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఐఏఎఫ్ మాజీ చీఫ్‌లు ఏవై టిప్నిస్, ఎస్పీ త్యాగి, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తదితరులు పాల్గొన్నారు.