Rafale Marine jets: నేవీ అమ్ములపొదిలో రాఫెల్ ఫైటర్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:24 AM
భారత నౌకాదళానికి రాఫెల్ మెరైన్ యుద్ధవిమానాల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం తెలిపింది. అలాగే సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణకు, జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపింది.

64 వేల కోట్లతో 26 మెరైన్‌జెట్లు
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్‌లపై మిగ్-29కేల స్థానంలో మోహరింపు
ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందం
ఆమోదం తెలిపిన కేబినెట్ కమిటీ
1,600 కోట్లతో ‘కృషి సించాయి’ కింద ప్రత్యేక ఉప పథకం
ఎం-సీఏడీడబ్ల్యూఎంతో సూక్ష్మ నీటిపారుదలకు ఊతం
సీసీఈఏ నిర్ణయాలు
న్యూఢిల్లీ/అమరావతి, ఏప్రిల్ 9: భారత నౌకాదళం అమ్ములపొదిలో భారీ యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. రూ.64 వేల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి రాఫెల్ మెరైన్ జెట్ ఫైటర్ల కొనుగోలుకు భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది. విమాన వాహక నౌకలు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లపై ప్రస్తుతం ఉన్న మిగ్-29కే ఫైటర్ల స్థానంలో రాఫెల్-ఎం ఫైటర్లు రానున్నాయి. ఇవి నౌకాదళ అవసరాల కోసం రూపొందించిన దసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్లు. 9.5 టన్నుల ఆయుధాలు, చమురు ట్యాంకులను తీసుకెళ్లడానికి వీటిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. భారత్, ఫ్రాన్స్ నడుమ ప్రభుత్వాల స్థాయిలో కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నారు. ఇది ఖరారైతే ఫ్రాన్స్ తర్వాత అటు వాయుసేనకు, ఇటు నౌకాదళానికి ఒకేరకమైన యుద్ధవిమానాలు ఉన్న దేశంగా భారత్ మారుతుంది. గగనతలం, సముద్రతలంపై ఆధిపత్యానికి ఇది తోడ్పడుతుంది. కొనబోతున్న 26 మెరైన్ ఫైటర్లలో 22 సింగిల్ సీటర్లు కాగా.. 4డబుల్ సీటర్లు. ఒప్పందం కుదిరిన ఐదేళ్లలో సరఫరా ప్రారంభమవుతుంది. జెట్ల నిర్వహణ, సిబ్బందికి శిక్షణ, అవసరమైన పరికరాలను భారత్‌లోనే ఉత్పత్తిచేయడం దీని ప్రత్యేకతలు. ఇప్పటికే భారత వాయుసేన వద్ద 36 రాఫెల్ ఫైటర్లు ఉన్నాయి.
గగనతలంలోనే ఇంధనం నింపుకోవడానికి రాఫెల్-ఎం జెట్లు వీటికి ఉపయోగపడతాయి. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎ్‌సవై) కింద ప్రత్యేక సబ్ స్కీంగా 2025-26 సంవత్సరానికి రూ.1,600 కోట్ల వ్యయంతో కమాండ్ ఏరియా డెవల్‌పమెంట్-వాటర్ మేనేజ్‌మెంట్ ఆధునికీకరణ (ఎం-సీఏడీడబ్ల్యూఎం) కార్యక్రమం అమలుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. నిర్దేశిత క్లస్టర్‌లో కెనాల్స్, ఇతర నీటి వనరుల ద్వారా జరిగే సాగునీటి సరఫరా నెట్‌వర్క్‌ను ఆధునికీకరించడం దీని ఉద్దేశం. పంజాబ్-హరియాణాల్లో వాహనాల రద్దీని నియంత్రించేందుకు పంజాబ్‌లోని మొహాలీ జిల్లా జిరాక్‌పూర్ వద్ద బైపాస్ నిర్మాణానికి సీసీఈఏ ఆమోదించింది. దీన్ని రూ.1,878.31 కోట్లతో 19.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు.