Cotton Import: పత్తి దిగుమతిపై సుంకం రద్దు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:02 AM
అమెరికా సుంకాల దెబ్బకు కకావికలమైన భారతీయ వస్త్ర పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది...
2022లో పొడుగు పింజ పత్తిపై వేసిన 11% పన్ను సెప్టెంబరు 30 వరకు నిలుపుదల
వస్త్ర పరిశ్రమ విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్ణయం
ట్రంప్ 50% బాదుడుతో కుదేలైన పరిశ్రమ
సుంకాలపై అమెరికాతో చర్చలు తేలేవరకు పత్తిపై దిగుమతి పన్ను లేనట్లేనని అంచనా
న్యూఢిల్లీ, ఆగస్టు 19: అమెరికా సుంకాల దెబ్బకు కకావికలమైన భారతీయ వస్త్ర పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పొడుగు పింజ పత్తిపై 2022లో విధించిన 11ు దిగుమతి సుంకాన్ని సెప్టెంబరు 30వరకు నిలిపేసింది. భారత వస్త్ర పరిశ్రమల సమాఖ్య చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం వెలువడింది. మూడేళ్ల క్రితం తన ఆదాయాన్ని పెంచుకొనేందుకు, దేశీయంగా పొడుగు పింజ పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ సుంకాన్ని విధించింది. ఇప్పుడు అమెరికాతో సుంకాల వివాదాన్ని పరిష్కరించుకొనే ప్రయత్నాలు కొలిక్కిరాని నేపథ్యంలో దేశీయ వస్త్ర వ్యాపారాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగా దాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. దీనివల్ల ఆస్ట్రేలియా, అమెరికా పత్తి రైతులకు ఊరట లభించనుంది. ఇది భారతీయ వస్త్ర వ్యాపారులకు కూడా శుభవార్తే. వారికి తక్కువ ధరకు నాణ్యమైన అమెరికా పొడుగు పింజ పత్తి లభించనుంది. తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.