Cyber fraud: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో ఐఐఎస్‌సీ శాస్త్రవేత్త
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:13 AM
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఐఎస్‌సీ శాస్త్రవేత్త డాక్టర్ సంధ్య నుంచి సైబర్ నేరగాళ్లు రూ.8.8 లక్షలు కాజేశారని బెంగళూరు..
రూ.8.8 లక్షలు కాజేసిన నేరగాళ్లు
బెంగళూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎ్‌ససీ) శాస్త్రవేత్త డాక్టర్ సంధ్య నుంచి సైబర్ నేరగాళ్లు రూ.8.8 లక్షలు కాజేశారని బెంగళూరు సెంట్రల్ డివిజన్ సీఈఎస్ పోలీసులు తెలిపారు. ఆదివారం వారు ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. వారి కథనం మేరకు.. ఈనెల 16న సంధ్యకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ మొబైల్ నంబరు పలుచోట్ల ఉపయోగిస్తున్నారని తెలిపాడు. ఆ తర్వాత కాసేపటికి దుండగులు మరో ఫోన్ నంబరు నుంచి కాల్ చేసి మీ పేరిట 17 కేసులు ఉన్నాయని మెసేజ్ చేశారు. వీటికి సంబంధించి ఓ పోలీసు ఆఫీసర్ మాట్లాడతారని మెసేజ్ చేశారు. కాసేపటికే మరొకరు ఫోన్ చేసి ‘మీరు మహిళల రవాణాలో భాగస్వామ్యులయ్యారని, సుప్రీంకోర్టుకు సంబంధించి పలు కేసులను చూపి మిమ్మల్ని సీబీఐ అధికారులు అరెస్టు చేస్తార’ని బెదిరించారు. భయపడిన సంధ్య తనపై ఎలాంటి కేసులు లేవనీ, తననెందుకు అరెస్టు చేస్తానని ప్రశ్నించారు. అయినా ఈ కేసు నుంచి బయటపడాలంటే ఏం చేయాలని ఆమె అడగడంతో, తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు నగదు జమ చేయాలని వారు సూచించారు. ఇలా రూ.8.80 లక్షలను జమ చేయించుకున్నారు.