Black Money: రూ.50 కోట్ల బ్లాక్‌మనీ ఉంది.. మారుస్తారా
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:25 AM
నాదగ్గర రూ.50 కోట్ల నల్లడబ్బు బ్లాక్‌మనీ ఉంది.. ఎవరైనా వైట్‌గా మారిస్తే రూ.కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన...
ఓ ఐఏఎస్ ఆఫర్.. అధికారుల్లో హాట్ టాపిక్‌గా ఆయన శైలి
హైదరాబాద్, సెప్టెంబరు19 (ఆంధ్రజ్యోతి): నాదగ్గర రూ.50 కోట్ల నల్లడబ్బు (బ్లాక్‌మనీ) ఉంది.. ఎవరైనా వైట్‌గా మారిస్తే రూ.కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇదీ! ఓ కీలకశాఖలో అత్యంత కీలక స్థానంలో పని చేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి, ఆ బాధ్యతల్లోకి వచ్చిన 4నెలల్లో ఇంత పెద్ద మొత్తం వెనుకేసుకోవడంపై ఉన్నతస్థాయి అధికారుల్లోనూ గుసగుసలు మొదలయ్యాయి. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది. అనుమతల కోసం ఓ వ్యాపారి ఇటీవల ఆ అధికారిని ఆశ్రయించగా రూ.3 కోట్ల ప్యాకేజీ తీసుకుని అనుమతులు ఇచ్చారనేది వ్యాపారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే వ్యాపారులను తన వద్ద ఉన్న రూ.50 కోట్ల నల్లధనం మార్చి ఇవ్వాలని తొలుత ఆశ్రయించారని.. అందుకు ప్రతిఫలంగా రూ. కోటి ఇస్తానని ఆఫర్ చేసినట్లు.. అది ఆనోటా ఈనోటా బయటపడి అధికార వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతుల్లో ఆయన సొంత ఖాతాలో ఉన్నవి ఎన్ని? ఇతరత్రా మార్గాల ద్వారా అనుమతులు కావాలని వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నట్లు తెలిసింది.