Share News

IAS officer Bharti Dixit filed a police complaint: ఐఏఎస్‌ భర్తపై ఐఏఎస్‌ భార్య కేసు

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:23 AM

రాజస్థాన్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ దంపతుల మధ్య తలెత్తిన కుటుంబ వివాదం పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది. చాలా కాలంగా భర్త తనను శారీరకంగా...

IAS officer Bharti Dixit filed a police complaint: ఐఏఎస్‌ భర్తపై ఐఏఎస్‌ భార్య కేసు

  • తనను కొట్టి, వేధిస్తున్నారని ఫిర్యాదు

జైపూర్‌, నవంబరు 11: రాజస్థాన్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ దంపతుల మధ్య తలెత్తిన కుటుంబ వివాదం పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లింది. చాలా కాలంగా భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త అయిన రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ డైరెక్టర్‌ ఆశీష్‌ మోదీ గృహహింసకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి భారతీ దీక్షిత్‌ కేసు పెట్టారు. ఇద్దరూ 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ కేడర్‌ అధికారులు. తనకు మాయమాటలు చెప్పి 2014లో వివాహం చేసుకున్నారని ఆమె ఆరోపించారు. తన తండ్రి క్యాన్సర్‌కు గురవడంతో తాను నిస్సహాయంగా ఉన్నానని, ఆ సమయంలో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నారు. తరచూ మద్యం సేవిస్తారని, క్రిమినల్‌ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దీన్ని ప్రశ్నించినందుకు తనను నిత్యం కొట్టేవారని చెప్పారు. 2018లో కుమార్తె పుట్టిన తరువాత వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. విడాకులు ఇవ్వకపోతే తనను, కుటుంబ సభ్యులను హత్య చేస్తానని గత నెలలో బెదిరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరి సహకారంతో తనను ప్రభుత్వ వాహనంలో బలవంతంగా తీసుకొని వెళ్లి వేరే చోట కొన్ని గంటల పాటు నిర్బంధించారని ఆరోపించారు. అక్కడ తుపాకీతో బెదిరించారన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 02:23 AM